హీట్ పుట్టిస్తున్న పంజాబ్ రాజకీయం.. పొత్తుల్లో అమరీందర్ దూకుడు
పంజాబ్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ ను వీడిన తర్వాత మరింత దూకుడుతో.. పొత్తులతో రాజకీయ హీటును పెంచుతున్నారు.
ఇటీవలి కాలంలో పంజాబ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని అన్ని పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఎలాగైనా రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మరింత దూకుడుగా ముందుకుసాగుతున్నారు. దీనికి అనుగుణంగానే ఇతర పార్టీలతో పొత్తుల విషయమై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులు పెట్టుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొంటూ.. ఆ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేల 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు గురించి స్పష్టత రానుంది. పొత్తులు కుదిరినట్టయితే, పోటీ చేస్తే స్థానాలు, సీట్ల సంఖ్య పైనా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది.
Also Read: రైతు ఉద్యమం ఆగదు.. పెండింగ్ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..
కాగా, ఇటీవల కాంగ్రెస్ నేత సిద్దూ తో విభేదాలు, పార్టీలో అంతర్గత కారణాల కారణంగా అమరీందర్ సింగ్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి రైతులకు అనుకూలంగా ఉన్న అమరీందర్.. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో.. బీజేపీతో దోస్తాన్‌కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు తనకు లేవని ప్రకటించారు. ఇక బీజేపీతో అమరీందర్ సింగ్ పార్టీ ఎన్నికల పొత్తు గురించి చర్చలు జరగకముందే.. మరో పార్టీ శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్).. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో కలిసి ముందుకు సాగడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నరాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా ఇదే విషయంపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో కాకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపాపారు. దీనికి సంబంధించి కెప్టెన్ అమరీందర్ పార్టీ, బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలతో పొత్తుపైన చర్చలు జరుగుతున్నాయన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు.
Also Read: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
ఇదిలావుండగా, అమరీందర్ సింగ్ పొత్తుల విషయంలో వేగంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలపై విమర్శలతో గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్ ను ఓడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయా పార్టీలను ఓడించేందుకు రానున్న ఎన్నికల్లో బీజేపీతో పాటుగా శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) తో కలిసి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ అమరీందర్ ప్రకటించారు. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్‌ను కలిశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆయా నాయకులు మాత్రం దీనిని మర్యాద పూర్వక భేటీగానే పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. దీనికి భారత ఎన్నికల సంఘం నుండి క్లియరెన్స్ రావాల్సి ఉంది.
Also Read: రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ పంజా.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌వో