కాంగ్రెస్ పార్టీ 10 మంది సీఎం అభ్యర్థులను ప్రకటించినా పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Punjab election news 2022 : పంజాబ్ (punjab)లో ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలో ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. అలాగే ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (aap) సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ (Bhagwant Mann) కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. పంజాబ్ లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలిపారు.
శనివారం మీడియాతో మాట్లాడిన భగవంత్ మాన్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 10 మంది సీఎం అభ్యర్థులను ప్రకటించినా ఆ పార్టీ పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోదని జ్యోష్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. సీఎం ఫేస్ (cm face)లను ప్రకటించిన ప్రయోజనం ఏమిటని ప్రశిస్తూ.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
“ నా పార్టీ నన్ను సీఎం అభ్యర్థిని చేసింది. దీంతో ప్రజలకు మాపై పూల వర్షం కురిపిస్తున్నారు. మీరు ప్రజాస్వామ్య పండుగను చూడాలనుకుంటే పంజాబ్‌కు రండి. మా ర్యాలీకి రండి” అని మన్ అన్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి నేడు రాహుల్ గాంధీ లూథియానా నుంచి వర్చువల్ పద్దతిలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఒక రోజు ముందుగానే మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్ లో జరగనున్న పోలింగ్ కు ముందుగానే కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని రాహుల్ గాంధీ (rahul gandhi) తన గత పర్యటనలో కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాన్ని తీసుకోవడంతో పాటు.. ప్రజల నుంచి కూడా ఆటోమేటెడ్ కాల్ సిస్టమ్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కోరుతోంది. “ ఈ ఎన్నికలు పంజాబ్ బాగు కోసం, ఈ ఎన్నికలు పంజాబ్ భవిష్యత్తు కోసం. ఫిబ్రవరి 6, 2022న లూథియానా (luthiana) నుండి వర్చువల్ ర్యాలీ ద్వారా పంజాబ్ తదుపరి సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటిస్తారు” అని పంజాబ్ యూత్ కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ (navojyoth siddu), ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ (charan singh channi) మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నవజ్యోత్ సిద్దూ కాంగ్రెస్ హైకమాండ్ పై గురువారం మండిపడ్డారు. పై స్థాయిలో ఉండే వారు తమ పాటలకు డ్యాన్స్ చేయగల బలహీన ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారని విమర్శించారు. ‘‘ నవ పంజాబ్‌ను తయారు చేయాలంటే.. అది సీఎం చేతుల్లో ఉంది. ఈసారి మీరే (ఓటర్లు) సీఎంను ఎన్నుకోవాలి. పార్టీ అధిష్టానం మాత్రం వారు చెప్పినట్టు వినేవారినే సీఎంగా చేయాలని భావిస్తోంది. మీకు అలాంటి సీఎం కావాలా? ’’ అని ఓటర్లను నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
