పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కూతురు రబియా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పేద వాడు కారనీ, ఆయన బ్యాంక్ అకౌంట్లు చెక్ చేస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని తెలిపారు.
Punjab Election News 2022 : పంజాబ్ కాంగ్రెస్ (punjab congress)లో ఇంకా అంతర్గత పోరు తగ్గడం లేదు. ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరు ఖరారైన నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్దూ (navyojyoth singh siddu) కూతురు రబియా (rabia) చన్నీపై విమర్శలు చేస్తున్నారు. తండ్రి తరఫున అమృత్‌సర్ (తూర్పు) నియోజకవర్గంలో ఆమె గురువారం ప్రచారం చేశారు. సీఎం చన్నీపై ఆరోపణలు చేశారు.
చరణ్ జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi) చెపుతున్నట్టుగా అతను పేదవాడా అని సందేహం వ్యక్తం చేసింది. ఆయన బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయాలని సూచించింది.“చన్నీ నిజంగా పేదవాడా? అతని బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయండి, రూ. 133 కోట్ల కంటే ఎక్కువే దొరుకుతుంది” అని ఆమె తెలిపారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్ సీఎం అభ్యర్థిగా తన తండ్రిని విస్మరించినందుకు కలత చెందిన రబియా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘‘బహుశా వారు (హైకమాండ్) కొంత బలవంతం చేసి ఉండవచ్చు. కానీ మీరు నిజాయితీ గల వ్యక్తిని ఎక్కువ కాలం ఆపలేరు. నిజాయితీ లేని వ్యక్తి చివరికి ఆగిపోవాలి ’’ అని రబియా చెప్పారు. “ అతను (సిద్ధూ) గత 14 సంవత్సరాలుగా పంజాబ్ కోసం పనిచేస్తున్నాడు, అతను రాష్ట్రానికి కొత్త మోడల్‌ను సృష్టిస్తున్నాడు. అతన్ని గౌరవించాలి ’’ అని ఆమె చెప్పారు. తన తండ్రికి, ఇతర రాష్ట్ర పార్టీ నాయకులకు మధ్య ఎలాంటి పోలికలు లేవని చన్నీని ఉద్దేశించి అన్నారు. విజయం నిజం అవుతుందని తెలిపారు. పంజాబ్ గడ్డు పరిస్థితిలో ఉందని, తన తండ్రి ఒక్కరే దానిని రక్షించగలరని రబియా అన్నారు.
“ డ్రగ్ మాఫియా, ఇసుక మాఫియాతో సహా ఆయనను తొలగించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. నిజాయితీపరుడైన వ్యక్తిని బాధ్యత వహించడానికి వారు ఎప్పటికీ అనుమతించరు” అని ఆమె ఆరోపించారు.
ఈరోజు పంజాబ్‌లో ఉన్న పరిస్థితిని చూసి సిద్ధూ బాధపడ్డాడని రబియా (rabia)అన్నారు. తన తండ్రి గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని చెప్పానని ఆమె పునరుద్ఘాటించారు. అమృత్‌సర్ (తూర్పు) నుంచి తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోటీ చేస్తున్న SAD నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియాపై కూడా రబియా విరుచుకుపడ్డారు. డబ్బు కోసం ప్రజలు తమను తాము అమ్ముకోరు, వారు సత్యానికి ఓటు వేస్తారని అన్నారు. సత్యానికి మాత్రమే ప్రజలు ఓటు వేస్తారని చెప్పారు.
ఇది ఇలా ఉండగా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరీ 14 జరగాల్సి ఉన్నాయి. అయితే, ఆ రోజు గురు రవిదాస్ జయంతి కావడంతో ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. పంజాబ్ లో ఎన్నికలు ఫిబ్రవరి 20 కి మార్చింది. పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.
