కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్లతో గురువారం పంచుకున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత కరెంటు అందిచడాన్ని ఆయన నిరాకరించారని చెప్పారు. 

Punjab Election News 2022 : పంజాబ్ (punjab)లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్నిపెంచాయి. ఒక పార్టీపై మ‌రో పార్టీ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో చెబుతున్నాయి. ప్ర‌జ‌ల‌పై హామీలు గుమ్మ‌రిస్తున్నాయి. ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. 

పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ (congress) నాయ‌కుడు రాహుల్ గాంధీ (rahul gandhi) రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చార సభ నిర్వ‌హించారు. ఓట‌ర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమ‌రీంద‌ర్ సింగ్ (amarinder singh)ను సీఎం ప‌దవి నుంచి ఎందుకు త‌ప్పించాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. పేదలకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నిరాకరించారని తెలిపారు. అందుకే పంజాబ్ సీఎం పదవి నుంచి ఆయ‌న‌ను తొలగించామ‌ని స్ప‌ష్టం చేశారు. పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో జరిగిన ర్యాలీలో ఆయ‌న అమ‌రీంద‌ర్ సింగ్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కెప్టెన్ కు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం ఉందని ఆయ‌నే త‌న‌తో స్వ‌యంగా చెప్పార‌ని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ (drugs) మహమ్మారిని విషయంపై రాహుల్ గాంధీ మ‌ట్లాడారు. ‘‘డ్రగ్స్ దేశానికి ముప్పు అని నేను పదే పదే చెబుతూనే ఉన్నాను. మళ్లీ చెబుతున్నాను, పంజాబ్ ప్రయోగాలు చేయాల్సిన రాష్ట్రం కాదు.’’ అని అన్నారు. మాదక ద్రవ్యాలు ఇక్కడి యువత జీవితాలను నాశనం చేయడం కొనసాగిస్తే.. పంజాబ్‌లో అభివృద్ధి అర్థరహితం అవుతుందని అన్నారు. 

అమ‌రీంద‌ర్ సింగ్ తొల‌గింపుపై నిన్న‌ ప్రియాంక గాంధీ (priyanka gandhi) కూడా మాట్లాడారు. ఏదో తప్పు జరుగుతోందని త‌మకు అర్థం అయ్యింద‌ని అందుకే నాయకత్వాన్ని మార్చుకున్నామ‌ని తెలిపారు. కొట్కాపురా (kotkapura) పట్టణంలో జరిగిన తన ఎన్నికల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరీందర్ సింగ్, బీజేపీ మధ్య వ్యూహాత్మక అవగాహన ఉందని ఆరోపించారు. అందుకే ఆయ‌న‌ను మార్చాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. దీంతో పంజాబ్ లో పాల‌న ఢిల్లీ ఆదేశాల ప్ర‌కారం కాకుండా రాష్ట్రం నుంచే సాగుతుంద‌ని తెలిపారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో అమరీందర్ సింగ్ సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అనంత‌రం ప‌లు సంద‌ర్భాల్లో కాంగ్రెస్ అధిష్టానంపై, రాష్ట్ర నాయ‌క‌త్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంత‌రం కెప్టెన్ అమ‌రీందర్ సింగ్ న‌వంబ‌ర్ లో సొంతంగా పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ పేరు పంజాబ్ లోక్ కాంగ్రెస్ (punjab lok congress). ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ (bjp)తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ పోటీ చేస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 14న జలంధర్‌ (jalandar)లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (prime minister narendra modi) ప్రసంగిస్తూ.. రిమోట్ కంట్రోల్‌తో పంజాబ్ ప్రభుత్వాన్ని నడపలేక‌పోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ అమ‌రీంద‌ర్ సింగ్ ను తొల‌గించింద‌ని వివ‌మ‌ర్శించారు. తాము ఫెడరలిజం (federalism)ను గౌర‌విస్తామ‌ని అన్నారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో తాము ఫెడరలిజం ప్ర‌కార‌మే క‌లిసి ప‌ని చేశామ‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.