బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పుణే కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మహిళ సహా ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... విదర్భ ప్రాంతానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక 2016లో వేసవి సెలవుల్లో గడిపేందుకు ముండ్వాలోని తన మేనమామ ఇంటికి వచ్చింది.

ఆమెతో తన అత్తయ్యతో కలిసి ఏప్రిల్ 13 నుంచి మే 25 మధ్యలో ముండ్వా, ఖరాడీల్లోని పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లింది. ఈ సమయంలో ఆమె అత్తయ్య బాలిక ముందే ముగ్గురు పురుషులతో కలిసి లైంగిక చర్యలో పాల్గొంది. అంతేకాకుండా, సదరు బాలికను కూడా లైంగిక చర్యలో పాల్గోనాల్సిందిగా చెప్పింది.

ఈ క్రమంలో మే 14న అత్తయ్య, బాలికను తీసుకుని పింగ్లివాస్తిలోని తన మావయ్య ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ బాలికను నేలమీదకు నెట్టిన మహిళ అనంతరం చిన్నారి నోరు మూసేయగా, అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బాలిక కాళ్లు చేతులు పట్టుకున్నారు.

మిగిలిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ నలుగురు బాలికను బెదిరించారు. ఇంటికి వచ్చిన తర్వాత తమ కూతురి ప్రవర్తనలో మార్పును గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా అసలు నిజం చెప్పింది.

దీంతో తల్లిదండ్రులు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో మే 31న ఫిర్యాదు చేశారు. తొలుత తన అత్తయ్య ముగ్గురు వ్యక్తులతో కలిసి తన ముందు లైంగిక చర్యలో పాల్గొన్న విషయాలను చెప్పిన బాలిక.. ఆ తర్వాత తనపై జరిగిన అత్యాచారాన్ని తెలిపింది.

తొలుత పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో క్రిమినల్ లాకు సవరణ చేసింది. దీని ప్రకారం రేప్ కేసులో ‘‘మగ’’ అన్న పదానికి బదులుగా ‘‘వ్యక్తి’’ అన్న పదాన్ని చేర్చింది.

తద్వారా లైంగిక దాడిని ప్రోత్సహించడంతో పాటు నిందితులకు సహకరించిన బాధితురాలి అత్తయ్యను మరింత కఠినంగా శిక్షించే అవకాశం దక్కింది. కొత్త చట్టం ప్రకారం సదరు మహిళతో సహా ముగ్గురు నిందితులకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్షతో లేదంటే యావజ్జీవ కారాగార శిక్షపడే అవకాశం ఉందని, న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.