పుణేలో గోడ కూలి 15 మంది అమాయకులు కూలిన దుర్ఘటన దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గోడ పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని.. ఐదు నెలల క్రితమే హౌసింగ్ సొసైటీ బిల్డర్‌ను హెచ్చరించినా ఆయన పెడచెవిన పెట్టాడని అల్మాన్ స్టైలస్ సొసైటీ నివాసులు పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.

పెండింగ్ పనుల విషయమై ఫిబ్రవరి 16న అల్కాన్ ల్యాండ్ మార్క్స్‌ భాగస్వామి అయిన వివేక్ అగర్వాల్‌తో సమావేశమయ్యారని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గోడ ప్రమాదకరంగా ఉందని.. నాసిరకంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డెవలపర్‌కు ఈ మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. అయితే గోడకు వచ్చిన ప్రమాదమేమీ లేదని... పటిష్టంగానే వుందని అల్కాన్ ల్యాండ్‌మార్క్స్ డైరెక్టర్‌ జగదీశ్ అగర్వాల్ చెప్పారని సొసైటీ సభ్యులు గుర్తు చేశారు.

ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత తాను వహిస్తానని కూడా అగర్వాల్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ-మెయిల్ సంభాషణను పూణే మునిసిపల్ కార్పోరేషన్‌కు, పోలీసులకు పంపినట్లు వివరించారు.

దీని ఆధారంగా అల్కాన్ ల్యాండ్‌మార్క్స్‌కు చెందిన జగదీశ్ ప్రసాద్ అగర్వాల్, సచిన్ అగర్వాల్, రాజేశ్ అగర్వాల్, వివేక్ అగర్వాల్, విపుల్ అగర్వాల్‌తో పాటు తవ్వకం పనులు చేపడుతున్న కంచన్ రాయల్ ఎగ్జోటికా ప్రాజెక్ట్‌కు చెందిన పంకజ్ వోరా, సురేశ్ షా, రష్మీకాంత్‌ గాంధీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అయితే తవ్వకం పనుల వల్ల పునాది బలహీనపడి గోడ కూలి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల  చొప్పున నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.