మహారాష్ట్రలోని పూణేలో శనివారం ఉదయం గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. తొలుత 14మంది కన్నుమూయగా.. ఇప్పుడు వారి సంఖ్య 17కి చేరింది. ఈ విషాదకర  సంఘటనపై స్థానిక జిల్లా కలెక్టర్ స్పందించారు.

 ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ రాం చెప్పారు. భారీవర్షాల వల్ల గోడ కూలిందని కలెక్టరు పేర్కొన్నారు. గోడ కూలిన ఘటనలో భవన నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యం ఉందని కలెక్టరు చెప్పారు. మృతులంతా బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కార్మికులని వివరించారు.

కుంద్వా ప్రాంతంలో నిలిపి ఉన్న ఆటోలు, కార్లపై గోడ కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.