జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ జిల్లాలోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

ఈ క్రమంలో ఓ ఇంట్లో దాగి వున్న ముష్కరులు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య భీకరంగా పోరు నడిచింది. అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

వీరంతా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా భావిస్తున్నారు. వీరిలో ఒకరు గత నెలలో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి కుట్రపన్నిన ప్రధాన సూత్రధారి ముదాసిర్ అహ్మద్ ఖాన్‌గా భావిస్తున్నారు.

పుల్వామా దాడికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అహ్మద్ ఖాన్ గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్‌కి పేలుడు పదార్థాలు, వాహనాన్ని ఏర్పాటు చేసింది అహ్మద్ ఖానే.

త్రాల్‌లోని మిర్ మొహల్లా ప్రాంతానికి చెందిన అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తి చేసి, ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ కోర్సులో చేరాడు. తీవ్రవాదం పట్ల ఆకర్షితుడై 2017లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. తొలుత గ్రౌండ్ వర్కర్‌గా పనిచేసిన అతను... 2018లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.