న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలపై సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది.

నిరసనల కోసం షాహీన్ బాగ్ లాంటి స్థలాలను రోజుల తరబడి ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.సీఏఏ వ్యతిరేక ఆందోళనల విషయమై  షాహీన్ బాగ్ లో రోడ్డును బ్లాక్ చేసిన విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎస్ కె కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. షాహీన్ బాగ్ నుండి నిరసనకారులను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.సీఏఏ ను నిరసిస్తూ ఢిల్లీలోని షాహీన్ బాగ్ ను కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున  డిసెంబర్ మాసంలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

షాహీన్ బాగ్ లో రోడ్డు బ్లాక్ చేసి ఆందోళనలు నిర్వహించే విషయమై న్యాయవాది అమిత్ సాహ్ని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఈ వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాలను ఖాళీ చేయించేందుకు కోర్టు ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.