ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అలీగడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీ ర్యాలీకి కొందరు బీజేపీ కార్యకర్తలు ఎదురుబడ్డారు. ప్రియాంక గాంధీ ర్యాలీ సమీపించగానే వారు ప్రధాని మోడీ, సీఎం యోగిని సమర్థిస్తూ నినాదాలు చేశారు. దీనితో వారితో ప్రియాంక గాంధీ తన వాహనం నుంచి బయటకు వంగి వారితో మాట్లాడారు. కాంగ్రెస్ యూత్ మ్యానిఫెస్టో వారికి ఆఫర్ చేశారు.
లక్నో: సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదరుబడటం జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో చాలా సార్లు ఒకరిని మరొకరు పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. కొన్ని సార్లు మరీ తీవ్ర పోటీ లేదా.. హింసా కోణాలు ఉన్నట్టైతే ఘర్షణలూ జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనలు చూశాం. కానీ, UP Elections 2022 క్యాంపెయిన్‌లో ఇందుకు భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ర్యాలీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ర్యాలీ ఎదురబడ్డాయి. అప్పుడూ కార్యకర్తలు గొడవ పెట్టుకోలేదు. పార్టీ నేతలు ఇద్దరూ ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ ఇరువురూ ఒకరికి ఒంకొకరు అభివాదం చేసుకున్నారు. తమ తమ ప్రచారాన్ని కొనసాగించారు. తాజాగా, ఇలాంటి ఘటనే ప్రియాంక గాంధీ ర్యాలీకి ఎదురైంది.
ప్రియాంక గాంధీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్ జిల్లాలో ప్రచారం చేశారు. ఇగ్లాస్, ఖైర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేశారు. అలీగడ్‌లో ఆమె ప్రచారం చేస్తుండగా.. ఆమె ర్యాలీకి ఒక చోట కొందరు బీజేపీ కార్యకర్తలు ఎదురుబడ్డారు. ప్రియాంక గాంధీ ర్యాలీ అక్కడకు చేరుకోగానే వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను సమర్థిస్తూ నినాదాలు ఇచ్చారు. వారిని అడ్డుకోకుంటే.. పరిస్థితులు దిగజారి పోయేవేమో.. కానీ, బీజేపీ పార్టీ కోసం నినదిస్తున్న ఆ పార్టీ కార్యకర్తలను సమీపించగానే ప్రియాంక గాంధీ తన వాహనాన్ని కొద్ది సేపు ఆపించారు. వాహనం నుంచి కిందకు వంగి వారితో మాట్లాడారు.
నిరసన చేస్తున్న బీజేపీ క్యాడర్‌కు చెందిన ఓ వ్యక్తితో ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఆమె భర్తీ విదాన్ పత్రాన్ని వారికి అందించే ప్రయత్నం చేశారు. భర్తీ విధాన్ అనేది కాంగ్రెస్ యూత్ మ్యానిఫెస్టో. కానీ, ఆ మ్యానిఫెస్టోను వారు తిరస్కరించినట్టు కనిపించింది. కాగా, ఆయనకు బదులు అదే గుంపులోని మరో వ్యక్తి ఆ మ్యానిఫెస్టో కాపీని అందుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ఓ మీడియా ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
అలీగడ్‌లో ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీ ఓ చోట సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఉడుకు రక్తం అంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల నియామకాలు గురించి చర్చిస్తున్నదని అన్నారు. అనేక మంది యువత ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 12 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, కానీ, రిక్రూట్ చేయడం లేదని ఆరోపించారు. కాబట్టి, ఈ సారి ఉద్యోగాలు రిక్రూట్ చేసే పార్టీని ఎన్నుకోవాలని, ఉడుకును, దుడుకును తగ్గిస్తామని కూసే పార్టీని ఇంటికి పంపాలని విమర్శించారు.
ఇదిలా ఉండగా ఈ నెల 3వ తేదీన జహంగీరాబాద్ ప్రాంతంలో ఓ వైపు నుంచి అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఓపెన్ కారు, మరో వైపు నుంచి ప్రియాంక గాంధీ (priyanka gandhi) ట్రాక్టర్ పై నుంచి వస్తూ ఎదురెదురుగా కలుసుకున్నారు. ఈ సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా కేకలు వేశారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ లు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు.
