రోడ్డు ప్రమాదంలో ఓ చిరుతపులి మృత్యువాతపడింది. ఆ సమయంలో చిరుత గర్భం దాల్చి ఉండటం గమనార్హం. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా భయేందర్ టౌన్ షిప్ సమీపంలోని కశ్మీరా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అర్దరాత్రి 12.30 గంటలకు ఆడచిరుతపులి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిరుతపులి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిరుతపులిని సమీపంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కు పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స చేస్తుండగా అది మరణించింది. 

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల వల్లనే చిరుతపులి మరణించిందని పశువైద్యాధికారులు చెప్పారు. చిరుతపులి కళేబరానికి పోస్టుమార్టం చేయగా గాయాల వల్లనే మరణించిందని తేలింది.రోడ్డు ప్రమాదంలో మరణించిన చిరుత పులి గర్భం దాల్చిందని, దాని కడుపులో మూడు పిండాలున్నాయని పశువైద్యాధికారులు చెప్పారు.