కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం ఇక దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ విషయంలో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ నివాసంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వ‌ర‌లోనే కాంగ్రెస్ లో చేరే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప‌ని చేయ‌నున్నారు. 

ప్ర‌శాంత్ కిషోర్ శ‌నివారం నాడు సోనియా గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆయ‌న ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 2024 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 370 సీట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో ఒంటరిగా పోరాడాలని కిషోర్ తన ప్రజెంటేషన్‌లో చెప్పారు. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పాత కూట‌మిగా ఏర్ప‌డి పోరాడ‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. 

ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలపై రాహుల్ గాంధీ అంగీకారం తెలిపార‌ని ANI వర్గాలు వెల్ల‌డించాయి. సోనియా గాంధీ నివాసంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ద‌త వ్య‌క్తం చేశారు. అలాగే భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టాల్సిన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌పై కూడా పీకే వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. 

ఈ విష‌యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్ర‌శాంత్ కిషోర్‌ సూచనలతో పాటు ఆయ‌న‌ను పార్టీలోకి చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కాగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశంపై గతంలో కూడా తీవ్రమైన ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సారి ఆయ‌న పార్టీలో ఎలాంటి ప‌ద‌వి అడ‌గ‌న‌ట్టు తెలుస్తోంది. 

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయ‌న ప‌లు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి రావ‌డానికి కృషి చేశారు. ఆయ‌న గ‌తంలో బీజేపీకి కూడా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి, ప‌శ్చిమ బెంగాల్ లో తృణ‌ముల్ కాంగ్రెస్ కు, అలాగే ఏపీలో వైసీపీకి, త‌మిళ‌నాడులో డీఎంకేకు కూడా సేవ‌లందించారు. ఆ పార్టీల గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. అయితే ఇన్ని పార్టీల‌కు ప‌ని చేసిన ఆయ‌న ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా మాత్రం విఫ‌ల‌మ‌య్యారు. 

గ‌తంలో ఆయ‌న బీహార్ కు చెందిన JD(U)లో చేరారు. ఆయ‌న ఆ పార్టీకి ఉపాధ్య‌క్షుడిగా కూడా ప‌ని చేశారు. కానీ పౌరసత్వ సవరణ చట్టంపై ఆయ‌న స్టాండ్ కారణంగా జనవరి 2020లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. దీంతో ప్ర‌స్తుతం వ‌ర‌కు ఆయ‌న ఏ పార్టీలో చేర‌లేదు. వివిధ పార్టీల‌కు మాత్రం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేశారు. 

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న బీజేపీకి సేవ‌లందించారు. ఆ పార్టీ అధికారంలోకి రావ‌డంలో ఆయ‌న కీల‌కంగా ప‌ని చేశారు. కానీ కొంత కాలం త‌రువాత పీకే ఆ పార్టీకి దూరం అయ్యారు. మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు.