బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. సిటిజన్స్ వాయిస్ నినాదంతో ఆయన పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు. తన నూతన ప్రయాణానికి లభిస్తున్న ప్రోత్సాహకర స్పందనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

మిగతా వివరాలను మీడియా ముఖంగా త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కు ధన్యవాదాలు తెలిపారు.