పంజాబ్ పర్యటనలో ప్రధానికి భద్రతా లోపంపై ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను ఆ ఫ్లై ఓవర్ వద్దకు పోలీసులు తమ వాహనంలో తీసుకువచ్చారని అన్నారు. వారితో ఆందోళనలు చేయించారని తెలిపారు. ఒక రకంగా పోలీసులే ఆందోళనలు చేశారని, ప్రధాని మోడీ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: పంజాబ్ పర్యటన(Punjab Visit)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి భద్రతా లోపాని(Security Lapse)కి బాధ్యత ఎవరనేదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులోనూ వాడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్ష సాక్షి(Eye Witness)గా ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(Retired IAS Officer) ఎస్ఆర్ లాధార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పోలీసులే ధర్నా చేశారని, ప్రధాని మోడీ భద్రతకు వీరే ముప్పు కలిగించారని ఆరోపించారు. ఆయన ఓ స్థానిక న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతు ఆందోళనకారులను ఆ సున్నిత ప్రాంతానికి పోలీసులు తీసుకు వచ్చారని మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ లాధార్ వెల్లడించారు. ఇది పక్కా ప్రాణాళికతో పంజాబ్ ప్రభుత్వం అమలు చేసిన కుట్ర అని ఆరోపణలు చేశారు. ‘నేను ప్రత్యక్ష సాక్షిని. నా కళ్ల ముందరే.. ఓ పోలీసు వ్యాన్(ఫార్చూనర్ ఎస్‌యూవీ)లో రైతులను ఎస్కార్ట్ చేసి అక్కడకు తెచ్చారు. ఆ రైతులు కర్రలు, బ్యానర్లు, జెండాలను వెంట తెచ్చుకున్నారు. పోలీసులే ఆ రైతులను ఇక్కడకు తెచ్చారు. ఆందోళనలను వారితో చేయించారు. ఆ రైతులు తమను తెచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పి ఆందోళనలకు ఉపక్రమించారు’ అని అన్నారు.
పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోడీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రత్యక్ష బాధ్యత అని వివరించారు. దీనికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ లాధర్ విజ్ఞప్తి చేశారు. పోలీసులే రైతులను అక్కడికి తెచ్చారని, ఆ తర్వాత ఆందోళనలు వారి అదుపు తప్పాయని పేర్కొన్నారు. అంతేకాదు, అక్కడ కొందరి ప్రాణాలు పోయే ముప్పు ఏర్పడిందని తెలిపారు.
కాగా, ప్రధాని పర్యటనలో ఆయన భద్రతా లోపంలో తమ బాధ్యత లేదని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. చివరి నిమిషంలో రూట్ మార్చారని పేర్కొంది. ఆ ఘటనను బీజేపీ చిత్రిస్తున్న విధానం చూస్తే.. తమ రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేసే కుట్రగా స్పష్టం అవుతున్నదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికే ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రధాని మోడీ కూడా ఆ ఘటనను పెద్దది చేశారని అన్నారు. ఒక్క రాయి కూడా అటువైపు విసరలేదని, ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ కాలేదని, ఒక్క నినాదాన్ని కూడా పలుకలేదని ఆయన తెలిపారు. కానీ, ప్రధానమంత్రి మాత్రం తాను ప్రాణాలతో బయట పడ్డాను అని ఏదో ముప్పు నుంచి తప్పించుకున్నట్టు మాట్లాడారని వివరించారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చంపడానికి కాచుక్కూర్చున్నట్టుగా మాట్లాడారని పేర్కొన్నారు.
పంజాబ్(Punjab)లో భద్రతా లోపం(Security Lapse) వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) బుధవారం 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పర్యటనను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనక్కి రావల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
