ఏసుక్రీస్తులా తిరిగి వస్తుందని 25 రోజులుగా ఓ మహిళ మృతదేహం వద్ద ప్రార్థలను చేస్తూ దాచిపెట్టిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. ఆ చనిపోయిన మహిళ పోలీస్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే  మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతోనే ఇలా జరిపినట్లు విచారణలో తేలడంతో షాక్ అయ్యారు. 

వివరాల్లోకి వెడితే చెన్నై టీ.నగర్‌లోని దిండుగల్‌ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర (38)  పోలీసు కంట్రోల్‌రూంలో పనిచేసేది. భర్తను విడిచి తన బిడ్డతోపాటు అక్క వాసుకి, ఫ్యామిలీ ఫ్రెండ్ సుదర్శనంతో కలిసి ఉండేది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల పాటు ఇందిర మెడికల్‌ లీవులో ఉంది. కాగా సెలవులు ముగిసినా ఇందిర విధులకు హాజరుకాలేదు. 

దీంతో గురువారం ఇద్దరు మహిళా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. ఆ సమయంలో ఇంటిలోని ఓ గది తలుపులు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన మహిళా పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. ఇందిర మృతదేహం వస్త్రాలతో చుట్టి ఉంది. షాక్ తిన్న పోలీసులు అక్క వాసుకి, ఫ్రెండ్ సుదర్శనంను విచారించారు. 

వాళ్లు చెప్పిన విషయాలు పోలీసులను గగుర్పాటుకు గురి చేశాయి. ఇందిర డిసెంబర్‌ 7న మృతిచెందిందని, అయితే ఆమె ఏసుక్రీస్తులా  మళ్లీ బతుకుతుందని, అందుకోసం రోజూ ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. 

దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.