తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ ఆర్మీ జవాన్ కి మైనర్ బాలిక చుక్కలు  చూపించింది.  తనను తాను రక్షించుకోవడంతోపాటు..  ఆ జవానును పోలీసులకు అప్పగించింది.ఈ సంఘటన పూణేలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోవా-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలు మహారాష్ట్ర లోని సతారా జిల్లా లోనంద్- సల్పా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో.. ఓ మైనర్ బాలికపై ఆర్మీ జవాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.కాగా.. సదరు మైనర్ బాలిక.. ఓ మాజీ సైనికుడి కుమార్తె కావడం గమనార్హం. బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి రైలులో ప్రయాణిస్తోంది.

ప్రభు మలప్ప ఉపహార్‌ అనే ఆర్మీ జవాను కూడా అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఉపహార్‌ ఆ బాలికను టాయిలెట్‌లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక మేల్కొని తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు గట్టిగా కేకలు వేసింది. దీంతో అతడు, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తానంటూ ఆమెను బయటకు తీసుకువచ్చి, రైలు కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తూ, రైలు ఆ సమయంలో తక్కువ వేగంతో వెళ్తుండటంతో పట్టాలపై పడిపోయిన బాలిక స్వల్పంగా గాయాలయ్యాయి.

బాలిక పట్టాలపై పడిఉండటాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కోలుకున్న బాలిక జరిగిన ఘటనను, ముఖ్యంగా ఆర్మీ జవాను పోలికలను పోలీసులకు వివరించింది. దీంతో, 400 మంది పోలీసులు, రైల్వే కానిస్టేబుళ్లు వేర్వేరు స్టేషన్లలో ఆ రైలులోకి ప్రవేశించి, ఆ రైలు నుంచి ప్రయాణికులెవరూ కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలిక చెప్పిన ప్రకారం పోలికలున్న 30 మందిని వేరుచేసి, అందులో నిందితుడైన ఉపహార్‌ను గుర్తించారు. అతడిని దగ్గర్లోని భుసావల్‌కు తీసుకెళ్లారు’ అని ఆయన వెల్లడించారు. ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పనిచేసే నాయిక్‌ హోదా జవానుగా గుర్తించామన్నారు.