అభం, శుభం తెలియని మైనర్ బాలికపై ఆమె సొంత కజిన్ కన్నేశాడు. ఇంట్లో వారెవ్వరికీ తెలియకుండా బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో.. బాలిక నోరు మెదపలేదు. అయితే.. అనుకోకుండా.. బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో.. ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. ఏడు నెలల గర్భిణి అన్న విషయం బయటపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బధోయూ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బధోయూ ప్రాంతానికి చెందిన బాలిక(15) పదో తరగతి చదువుతోంది. కాగా.. ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పలు పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు. అది కూడా ఏడు నెలల గర్భమని చెప్పడం గమనార్హం.

కనీసం పొట్ట కూడా పెద్దగా కనిపించకపోవడంతో.. ఇంట్లో కుటుంబసభ్యులకు తెలియలేదు. దీంతో డాక్టర్లు చెప్పిన విషయం విని వారి గుండె పగిలిపోయింది. వెంటనే బాలికను ఈ విషయంపై ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తన సొంత కజిన్ ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు.. బాధితురాలి కజిన్‌ను అరెస్టు చేశారు.