బంగారం స్మగ్లింగ్  చేయడంలో కొత్త పద్ధతులను స్మగ్లర్స్ కనిపెడుతున్నారు. ఇప్పటి వరకు.. రకరకాలుగా బంగారం స్మగ్లింగ్ చేయడం చూసి ఉంటారు. తాజాగా.. ఖర్జూర పండులో బంగారాన్ని దాచి మరీ తీసుకువచ్చారు. అయితే.. స్మగ్లర్ల అతి తెలివిని కష్టమ్స్ అధికారులు పట్టేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్ పోర్టులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖర్జూర పండులో బంగారం తెచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను ఖర్జూర పండులో 300 గ్రాముల బంగారాన్ని ఉంచి తీసుకొచ్చాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు బంగారాన్ని గుర్తించారు. స్వాదీనం చేసుకున్న బంగారం విలువ రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.