ఆమెకు అప్పటికే పెళ్లైంది. అయితే.. భర్తతో వచ్చిన మనస్పర్థలతో ఆమె అతనికి దూరంగా వచ్చింది. భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా జీవిస్తోంది. అయితే.. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇక అతనితోనే జీవితం అని ఆమె సంబరపడిపోయింది. అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ.. ప్రేమించిన ప్రియుడే ఆమెను వదిలేశాడు. దారుణంగా చంపేసి తన ఇంట్లోనే పాతేశాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొల్లామ్‌ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర అనే మహిళ కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు పెళ్లి కాగా.. కొన్ని కారణాలతో భర్తకు దూరమైంది. ఆ తర్వాత మనాలీకి చెందిన కీబోర్డ్‌ ప్లేయర్‌ 32 ఏళ్ల ప్రశాంత్‌ సోషల్‌ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయమయ్యాడు. కొంతకాలంగా ప్రశాంత్‌, సుచిత్రల మధ్య ప్రేమాయణం సాగింది.

ఇదిలా ఉండగా.. మార్చి 17వ తేదీన మామయ్యకు బాగా లేదని, తాను వెంటనే అలప్పుజాకు వెళ్లి ఆయనను చూసుకోవాల్సి ఉందని తనకు సెలవు కావాలని కంపెనీకి మెయిల్‌ చేసింది. తర్వాతి రోజు మరో ఐదు రోజులు సెలవులు పొడిగించాలంటూ మళ్లీ మెయిల్‌ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్‌ పని మీద ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లతో చెప్పి వెళ్లింది. 

ఐదు రోజులైనా సుచిత్ర ఒక్కసారి కూడా ఫోన్‌ చేయకపోవడంతో అనుమానుమొచ్చి సుచిత్ర పని చేస్తున్న సంస్థకు ఫోన్‌ చేయగా ఇక్కడికి రాలేదని, తాను వాళ్ల మామయ్యకు బాగా లేదని చెప్పి ఐదు రోజులు సెలవు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భర్తతో విడిపోయి మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందని తేలింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ప్రియుడు ప్రశాంత్ ని అదుపులోకి తీసుకొని విచారించారు.

అయితే..సుచిత్ర తనను పెళ్లి చేసుకోవాలని తరచూ ఒత్తిడి పెడుతోందని ఆమెను వదలించుకోవాలని హత్య చేశాడు. అనంతరం శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టేశాడు. పోలీసులు దర్యాప్తులో నిజం అంగీకరించడంతో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.