తల్లీ, కొడుకులను అతి దారుణంగా హత్య చేసి.. 16కేజీల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. కాగా... ఈ కేసును పోలీసులు కేవలం నాలుగు గంటల్లోనే చేధించారు. ఓ నిందితుడు పోలీసులు కాల్పుల్లో మృతి చెందగా.. మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మైలాడుతురై జిల్లా సీర్కాళి, ధర్మకుళంలో స్థానిక రైల్వేరోడ్డుకు చెందిన ధన్ రాజ్ చౌదరి అనే వ్యక్తి నగల దుకాణం, తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంటి తలుపు తట్టారు. ధన్ రాజ్ తలుపు తీయడంతో.. దుండగులు ఆయనపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు.

ఆయన భార్య ఆశ(48), కుమారుడు అఖిల్(25)ను కత్తితో నరికారు. అడ్డుకోబోయిన కోడలు నెహాల్ పైన కూడా దాడి చేశారు. ఇంట్లో ఉన్న 16కిలోల బంగారు నగలు, సీసీటీవీ దృశ్యాలు నమోదైన హార్డ్ డిస్క్ తో ఇంటి ముందున్న కారులో పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఆశ, అఖిల్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

దుండగులను పట్టుకోవడానికి పోలీసులు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మేలమాత్తూర్ ప్రాంతంలో కారు ఆగిపోవడంతో... దిగి పారిపోతుండగా గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16 కేజీల బంగారం, 2 తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.