న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం శుక్రవారంనాడు ఉదయం 11 గంటలకు  జరగనుంది. దేశంలో  కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో   కేంద్ర కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.దేశంలో  పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ను విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ లు, వీకేండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. ఈ ఏడాది మే 2న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

లాక్ డౌన్ విషయంలో  నిర్ణయం తీసుకొనే బాధ్యతను కేంద్రం ఆయా రాష్ట్రాలకు అప్పగించింది. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుండి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసుకొనే అవకాశం కల్పించింది.లాక్‌డౌన్ పెడితే ఆర్ధిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు  చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ వేయించడం ద్వారా  కొంత మేర కరోనా కేసులను తగ్గించేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ఇవాళ ఉదయం 11 గంటలకు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో  కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కరోనాను కట్టడి చేసేందుకు  దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతోంది.  ఈ విషయాలపై కేబినెట్ సమావేశంలో చర్చింనుంది.దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ పౌరుల కోసం ఆసుపత్రులను తెరవనుంది. ఈ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స అందిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నారావణే తెలిపారు. ఐఎఎఫ్ చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియాతో బుధవారం నాడు  ప్రధాని  నరేంద్రమోడీ చర్చించారు.