Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి: ఖండించిన మోడీ, అండగా ఉంటామని హామీ

ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన బాధితులకు, ఫ్రెంచ్ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు. 

PM Narendra Modi strongly condemns the terrorist attack in France
Author
New Delhi, First Published Oct 29, 2020, 8:53 PM IST

ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన బాధితులకు, ఫ్రెంచ్ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు. "  నైస్ లో జరిగిన దారుణం సహా ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని మోడీ గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు.

బాధితుల కుటుంబాలకు , ఫ్రాన్స్ ప్రజలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్ ఫ్రాన్స్‌తో నిలుస్తుందని మోడీ భరోసా ఇచ్చారు. 

వాస్తవానికి, గత 15 రోజుల్లో ఫ్రాన్స్‌లో జరిగిన రెండవ అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో గుర్తు తెలియని దుండగుడు ఒక మహిళను శిరచ్ఛేదనం చేసి చర్చి వెలుపల 2 మందిని పొడిచి చంపాడు.

ఇంతవరకు హత్యకు కారణం తెలియరాలేదు. అయితే నగర మేయర్ క్రిస్టియన్ అట్రోసి ఈ సంఘటనను ఉగ్రవాద సంఘటనగా పేర్కొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఫ్రెంచ్ పోలీసులపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు.

ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఈ దాడి జరిగింది. అనంతరం స్థానిక పోలీసులు గురువారం ఉదయం దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి నైస్‌లోని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

అరెస్టు సమయంలో నిందితుడు గాయపడ్డాడని, అందువల్ల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ దాడికి మహ్మద్ ప్రవక్త యొక్క కార్టూన్ వివాదంతో సంబంధం ఉందా అనేది స్పష్టత లేదు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఫ్రెంచ్ ఉగ్రవాద నిరోధక సంస్థ దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అతను చర్చి వార్డెన్‌గా వున్న వ్యక్తిని హత్య చేశాడు. పోలీసులకు పట్టుబడిన సమయంలో నిందితుడు అల్లాహ్-హు-అక్బర్ నినాదాన్ని చేసినట్లు నైస్ మేయర్ క్రిస్టియన్ అట్రోసి ఈ సంఘటనపై చెప్పారు. దీనిని బట్టి అతని ఉద్దేశ్యం ఏమిటో వేరే చెప్పనక్కర్లేదని మేయర్ తెలిపారు. 

ఈ దాడికి సుమారు 13 రోజుల ముందు, అక్టోబర్ 16 న, ఫ్రాన్స్‌లో ఇదే తరహా దాడి జరిగింది, దీనిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. 18 ఏళ్ల అబ్దుల్లాఖ్ అంజోరోవ్,  ఫ్రెంచ్ ఉపాధ్యాయుడిని హత్య చేశాడు. టీచర్ ప్రవక్త మొహమ్మద్ కార్టూన్ చూపించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి. మరణించిన ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కావచ్చని మేక్రాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తరువాత, ఫ్రాన్స్ పార్లమెంటులో సదరు ఉపాధ్యాయుడికి నివాళి అర్పించారు. ఫ్రెంచ్ పార్లమెంట్ ఈ దాడిని 'అనాగరిక ఉగ్రవాద దాడి'గా అభివర్ణించింది.


మరోవైపు మొహమ్మద్ ప్రవక్త కార్టూన్‌పై వివాదం కొనసాగుతోంది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా ఫ్రెంచ్ వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

టర్కీలో ప్రారంభమైన ఈ నిరసనలు బంగ్లాదేశ్‌ వరకు చేరుకుంది. ఇదే సమయంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదంపై చర్యలు కొనసాగిస్తోంది. బరాసిటీ అనే ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థను సర్కార్ మూసివేసింది.

ఈ సంస్థ 26 దేశాలలో సుమారు 2 మిలియన్ల మందితో కార్యకలాపాలు సాగిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇస్లామిక్ ఫండమెంటలిజంపై తీవ్ర దాడి తప్పదని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios