ప్రధాని నరేంద్ర మోడీ మానవత్వం చాటుకున్నారు. అంబులెన్స్ వెళ్లేందుకు గాను తన కాన్వాయ్‌ని ఆపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మనదేశంలోనే కాదు.. ఈ భూమ్మీద ఏ రోడ్డు మీద అంబులెన్స్ సైరెన్ వినిపించినా ఏదో ఒక ప్రాణం ఆపదలో వుందనే అర్ధం. అందుకనే కుయ్ కుయ్ అన్న సైరెన్ వినిపిస్తే చాలు.. రోడ్డు మీద వెళ్లే వాహనాలు పక్కకు తప్పుకుని దారి ఇస్తాయి. మనదేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు కూడా తమ వాహనాలను ఆపించి అంబులెన్స్‌లకు దారి ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మానవత్వం చాటుకున్నారు. తాను ప్రయాణిస్తున్న మార్గంలో వెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని మోడీ కాన్వాయ్‌‌ని ఆపించారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వివరాల్లోకి వెళితే... ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం అహ్మాదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ప్రయాణిస్తున్నారు మోడీ. ఈ సమయంలో అంబులెన్స్ వెళ్తున్నట్లు గమనించిన ప్రధాని మోడీ తన కాన్వాయ్‌ని ఆపాలని అధికారులను ఆదేశించారు. దీంతో అంబులెన్స్ వెళ్లేంత వరకు మోడీ కాన్వాయ్ నిలిచిపోయింది. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రధాని చేసిన మరో చర్యగా బీజేపీ దీనిని అభివర్ణించింది. భారతదేశంలో వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా వుండాలని 2017లో ప్రధాని మోడీ భారతీయులను కోరిన సంగతి తెలిసిందే. వీఐపీ స్థానంలో ఈపీఐ (ప్రతి వ్యక్తి ముఖ్యమే) అన్న నినాదాన్ని ఇచ్చారు. ప్రతి వ్యక్తికి విలువ, ప్రాముఖ్యత వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దశాబ్ధాలుగా భారతీ సమాజంలో వీఐపీ చిహ్నంగా భావించే ఎర్ర బుగ్గలకు ప్రధాని మోడీ నాయకత్వంలోనే చెల్లుచీటి పాడిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్ - ముంబై మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని పచ్చజెండా ఊపారు. అనంతరం మోడీ అందులో ప్రయాణించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు నడవనుంది. ఇప్పటికే న్యూఢిల్లీ- వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా, న్యూఢిల్లీ-శ్రీమాతా వైష్ణోదేవి మార్గంలో మరో రైలును కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

Scroll to load tweet…