Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నియోజకవర్గం నుంచి లోక్ సభ ప్రచారానికి ప్రధాని మోడీ శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
 

pm narendra modi lok sabha poll campaign to start from mallikarjun kharge home constituency kms
Author
First Published Mar 13, 2024, 4:12 PM IST

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీన మల్లికార్జున్ ఖర్గే గతంలో ప్రాతినిధ్యం వహించిన కాలబురగి నుంచి క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ కర్ణాటక జనరల్ సెక్రెటరీ వీ సునీల్ కుమార్ బుధవారం వెల్లడించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాలబురగి జిల్లా నివాసి. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన గెలిచారు. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్‌పై ఓడిపోయారు. ఈ సారికి ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దోడ్డమనిని ఇక్కడి నుంచి బరిలోకి నిలిపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర బీజేపీ హెడ్‌క్వార్టర్‌లో వీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రచారం గురించి వివరాలు వెల్లడించారు. మార్చి 16వ తేదీన కాలబురగిలో ఎన్వీ ప్లే గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడుతారని వివరించారు. ఆ తర్వాత 18వ తేదీన శివమొగ్గలోని అల్లమప్రభు గ్రౌండ్‌లో పాల్గొంటారని తెలిపారు.

Also Read: బీజేపీ గెలవాలి.. కానీ మోడీ మళ్లీ ప్రధాని కావొద్దు - సుబ్రమణ్యస్వామి

కర్ణాటక బీజేపీకి కీలకమైన దక్షిణాది రాష్ట్రం. బీజేపీ అధికారాన్ని చేపట్టిన ఏకైక దక్షిణాది రాష్ట్రం. గ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 లోక్ సభ సీట్లకు గాను బీజేపీ 25 సీట్లను గెలుచుకుంది. బీజేపీ మద్దతు ఉన్న ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా గెలిచారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 224 అసెంబ్లీ సీట్లకుగాను 135 సీట్లు గెలుచుకుంది. కాగా, బీజేపీ 66, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి. జేడీఎస్ పార్టీ గత సెప్టెంబర్ నెలలో ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios