Asianet News TeluguAsianet News Telugu

డబుల్ ఇంజన్ ప్రభుత్వమే రెట్టింపు వేగంతో పనిచేస్తుంది.. యూపీలో ఎయిమ్స్, ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సొంత నియోజర్గం గోరఖ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌‌ సైన్స్‌స్‌ను (AIIMS) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రారంబించారు. ఎయిమ్స్‌తో పాటు, భారీ ఎరువుల కర్మాగారంతో సహా మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు.

PM Narendra Modi inaugurates AIIMS fertiliser plant in Uttar Pradesh Gorakhpur
Author
Gorakhpur, First Published Dec 7, 2021, 5:05 PM IST

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సొంత నియోజర్గం గోరఖ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌‌ సైన్స్‌స్‌ను (AIIMS) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రారంబించారు. ఎయిమ్స్‌తో పాటు, భారీ ఎరువుల కర్మాగారంతో సహా మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ. కేంద్రం, యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు.. డబుల్ ఇంజన్ మాదిరిగా రెట్టింపు వేగంతో ప్రజల అభివృద్ది, శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాయని అన్నారు. గోరఖ్‌పూర్‌లో ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ ప్రారంభం అనేక సందేశాలను పంపుతోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. పని రెట్టింపు వేగంతో జరుగుతుంది. నిజాయితీ కలిగిన ఉద్దేశంతో పనిచేసినప్పుడు.. విపత్తులు కూడా అడ్డంకిగా మారవు’ అని తెలిపారు. 

అణగారిన వర్గాల గురించి ఆందోళన చెందే ప్రభుత్వం ఉన్నప్పుడు.. అది కష్టపడి పనిచేస్తుందని మోదీ అన్నారు. అంతేకాకుండా సరైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు. నవ భారతదేశానికి సంకల్పం వచ్చినప్పుడు.. అసాధ్యమనేది ఏది ఉండదనే దానిని నేడు గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమమే నిదర్శనం అని అన్నారు. 

‘నేను 5 సంవత్సరాల క్రితం ఎయిమ్స్, ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి ఇక్కడకు వచ్చాను. ఈ రెండింటినీ కలిపి ఈరోజు ప్రారంభించే భాగ్యం మీరు నాకు ఇచ్చారు. ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం కొత్త భవనం కూడా నేడు ప్రారంభించబడింది.  ఉత్తరప్రదేశ్ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఇక, గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ.. ఎరువుల కర్మాగారం,  ఎయిమ్స్ తోపాటుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మూడు మెగా ప్రాజెక్టుల కోసం రూ.9,600 కోట్లకుపైగా వెచ్చించారు. ఇక, ఈ ఎరువుల కర్మాగారాన్ని హిందుస్థాన్ ఉర్వరాక్ రసాయన్ లిమిటెడ్ (HURL) నిర్వహిస్తుంది. రూ. 1,011 కోట్లతో నిర్మించిన గోరఖ్‌పూర్ ఎయిమ్స్.. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాకుండా బీహార్, జార్ఖండ్, నేపాల్‌లోని ప్రజలకు కూడా ప్రపంచ స్థాయి ఆరోగ్య సదుపాయాలతో సేవలు అందించనుందని వైద్యులు తెలిపారు.

 

అదేవిధంగా.. రూ.36 కోట్లతో నిర్మించిన ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం ద్వారా వెక్టార్ వల్ల సంక్రమించే వ్యాధుల పరీక్షలు, పరిశోధనలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. వ్యాధులకు సంబంధించిన పరీక్షల కోసం పెద్ద నగరాలపై ఆధారపడటాన్ని ఈ ల్యాబ్ తగ్గిస్తుందని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios