న్యూఢిల్లీ:  దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనేది తమ అభిమతమని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. 

మంగళవారం నాడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన పాల్గొన్నారు.   రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని మోడీ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం బిర్లా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రజలు తమ పార్టీకి మరోసారి అవకాశాన్ని ఇచ్చారని.. ప్రజల తీర్పును గర్వకారణంగా భావిస్తున్నట్టుగా మోడీ చెప్పారు. ఇంత స్పష్టమైన మెజారిటీ ఎప్పుడూ రాలేదన్నారు.  అన్ని సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం తనకు ఉందన్నారు. 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కంటే పెద్ద విజయం మరోటి ఉండదన్నారు.తమ పార్టీ ఐదేళ్ల పనితనానికి ప్రజలు ఈ తీర్పును ఇచ్చారని  ఆయన అభిప్రాయపడ్డారు. విపక్ష నేతల సలహాలను స్వీకరిస్తామని మోడీ ప్రకటించారు.  ఎన్నికల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదన్నారు.