స్వతంత్ర భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్‌కు దీటైన కౌంటర్‌ను పీఎం మోడీ ఇచ్చారు. ఈ రోజు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. నెహ్రూ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదనే కాంగ్రెస్ ఆరోపణలను ఇలా తిప్పికొట్టారు. అదే సమయంలో యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా చేసిన చిదంబరంపైనా విరుచుకుపడ్డారు. 

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఈ రోజు లోక్‌సభలో కాంగ్రెస్‌(Congress)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక సందర్భంలో ఆ పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి ఆ పార్టీకి చెందిన నేత, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru)ను ప్రస్తావించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలను తీసుకుని కాంగ్రెస్‌కు గుక్కతిప్పుకోనివ్వని జవాబు ఇచ్చారు. మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదని, ఎకానమీ పట్ల బాధ్యతా రాహిత్యంగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ప్రధాని మోడీ చాకచక్యంగా తిప్పికొట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన లోక్‌సభలో ఈ రోజు మాట్లాడారు.

‘నార్మల్‌గా నేను మీ వల్లే నెహ్రూ పేరును తీయను. కానీ, ఈ రోజు నేను ఆయన గురించి మాట్టాడతాను. లాల్ ఖిల్లాపై ఉండి నెహ్రూ మాట్లాడుతూ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. ఒక్కోసారి కొరియా దేశాల మధ్య యుద్ధం కూడా మన దేశంలోని నిత్యావసరాల ధరలను ప్రభావితం చేయగలవని నెహ్రూ చెప్పారు. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి అప్పుడు నిస్సహాయుడిగా ఉన్నాడు. అప్పుడు ద్రవ్యోల్బణం సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని ఊహించవచ్చు’ అని వివరించారు.

ఒక వేళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉండి ఉంటే.. ధరల పెరుగుతున్న ధరలకు కారణం కరోనా మహమ్మారినే అని బ్లేమ్ చేసేదని ప్రధాని అన్నారు. నేడు అమెరికాలో ద్రవ్యోల్బణం ఏడు శాతంగా ఉన్నదని వివరించారు. కానీ, తాము ఇలా జవాబుదారీతనం లేకుండా సమస్యను పక్కకు నెట్టేసేవారం కాదని చెప్పారు. తమ ప్రనభుత్వం ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. కరోనా మహమ్మారి తాండవించినా ద్రవ్యోల్బణం అదుపు దాటి పోకుండా నియంత్రించగలిగతామని వివరించారు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 5 శాతం లోపే ఉంచగలిగామని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీ చిదంబరంపై ప్రధాని మోడీ విమర్శలు చేసిన తర్వాత నెహ్రూను ప్రస్తావించారు. పీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడూ దేశంలోని ఆర్థిక స్థితిని.. ఒక సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు.‘2011లో మీరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే మ్యాజిక్‌లు ఉన్నాయని ఊహించకండి అంటూ సిగ్గులేకుండా వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేమని మీరు అప్పుడు అంగీకరించారు. ప్రజలు మినరల్ వాటర్ బాటిల్ కొనడానికి రూ. 15 పెడతారు.. కానీ, గోధుమలపై ఒక్క రూపాయి పెరిగినా అదేదో పెద్ద సమస్యగా వారికి కనిపిస్తుంది అన్నారు’ అంటూ పీఎం మోడీ ధ్వజమెత్తారు.

రోనా మహమ్మారి కాలంలో కాంగ్రెస్ అన్ని హద్దులు దాటేసింది. కరోనా నిబంధనల పాలనలోనూ ఆటంకాలు సృష్టించింది. ముఖ్యంగా వలస కార్మికులను లాక్‌డౌన్ సమయంలోనూ ఇంటికి పరిమితం చేయకుండా స్వగ్రామాలకు తరలి వెళ్లేలా రెచ్చగొట్టింది. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు వాడుకుని ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించేవారు.. ఆయన ఆశయాలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఆయన కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుంటే ఎందుకు సహకరించదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మరో వందేళ్లు అధికారంలోకి రాలేము అనే ఆలోచనలతోనే వ్యవహరిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నదని విమర్శించారు. వారు అందుకు సిద్ధమై ఉంటే.. అధికారంలో ఉండటానికి తాము సిద్ధమై ఉన్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఈ రోజు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్‌పై ఆలౌట్ అటాక్ చేశారు.

"