కరోనా వైరస్‌కు టీకా ప్రయత్నాలు చేస్తున్న భారతీయ సంస్థలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కరోనా టీకా అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడారు.

ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్య), సీనియర్‌ శాస్త్రవేత్తలు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆరోగ్యశాఖ అధికారులకు మోడీ సూచించారు. ఇదే సమయంలో శాస్త్రీయ, సంప్రదాయ చికిత్సల అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పలు సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి.. నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మోదీ అధికారులకు సూచించారు.

అదే విధంగా సెరో సర్వేలు, పరీక్షలు వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.  టీకాలు సిద్ధమైతే క్షేత్ర స్థాయిలో పంపిణీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని మోడీ కోరారు. క్రమం తప్పకుండా వేగంగా, చౌక ధరలో పరీక్షించే సదుపాయం త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని నరేంద్రమోడీ పేర్కొన్నారు.