Asianet News TeluguAsianet News Telugu

బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడుల తర్వాత..  ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

PFI plotted to attack PM Modi in Bihar reports
Author
First Published Sep 24, 2022, 9:39 AM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడుల తర్వాత..  ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాట్నాలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్టుగా తేలింది. ప్రధాని మోదీ ర్యాలీతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులు చేసేందుకు టెర్రర్ మాడ్యూల్స్, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో పీఎఫ్‌ఐ నిమగ్నమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. 

కేరళలో అరెస్ట్ చేసిన పీఎఫ్‌ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌పై రిమాండ్ నోట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ ఏడాది జూలై 12న ప్రధాని నరేంద్ర మోదీ పాట్నా పర్యటన సందర్భంగా దాడి చేసేందుకు పీఎఫ్‌ఐ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసిందని ఈడీ పేర్కొంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. 

ఇక, ఈ సంస్థ కొన్నేళ్లుగా సేకరించిన రూ. 120 కోట్ల వివరాలను ఈడీ కనుగొంది. ఈ నిధులు.. దేశవ్యాప్తంగా అల్లర్లు, తీవ్రవాద కార్యకలాపాలను సృష్టించేందుకు వినియోగించాలని ఉద్దేశంతో కూడుకున్నవని తెలుస్తోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో అనేక ఏజెన్సీలు.. ఇటీవల పలు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై  సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 100 మందికి పైగా పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థల సభ్యులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. వీరిలో నలుగురిని  ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీలాడరింగ్‌కు సంబంధించి వీరిని ఈడీ విచారించింది. 

‘‘కొన్ని సంవత్సరాలుగా  పీఎఫ్‌ఐ, సంబంధిత సంస్థల ఖాతాలలో రూ. 120 కోట్ల కంటే ఎక్కువ జమ చేయబడ్డాయి. దేశంలో, విదేశాలలో.. గుర్తుతెలియని, అనుమానాస్పద మూలాల నుండి చాలా ఎక్కువ భాగం నగదు రూపంలో జమ చేయబడింది. ఈ నిధులు కాలక్రమేణా వారి నిరంతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఉపయోగించేందుకు బదిలీ చేయబడ్డాయి. వీటిలో హింసను ప్రేరేపించడం, ఫిబ్రవరి 2020 నాటి ఢిల్లీ అల్లర్లకు దారితీసిన ఇబ్బందులను రేకెత్తించడం, మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో హత్రాస్‌కు పీఎఫ్‌ఐ సభ్యుల సందర్శన, అల్లర్లను రెచ్చగొట్టడం, భీభత్సాన్ని వ్యాప్తి చేయడం, దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని అణగదొక్కాలనే ఉద్దేశ్యంతో యూపీలోని ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులు చేయడానికి ఒక టెర్రర్ గ్యాంగ్, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణకు ప్రణాళిక చేయబడింది’’అని ఈడీ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios