మొసలి పేరు చెబితేనే మనలో చాలామందికి నిద్రపట్టదు. నీటిలో నివసిస్తూ అమాంతం మింగేసి ఈ జీవి ఉన్న ప్రాంతాల వద్దకు కూడా జనం వెళ్లరు. అలాంటిది చనిపోయిన ఓమొసలికి ఊరు ఊరంతా కలిసి దానికి అంత్యక్రియలు చేశారు.

వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌ బేమాత్రా జిల్లా బావామొహాత్రా గ్రామంలోని చెరువులో సుమారు 130 సంవత్సరాల వయసున్న మొసలి నివసిస్తోంది. సాధారణంగా తను ఉన్న ప్రాంతంలో ఏదైనా జీవి కనిపిస్తే దానిని చంపి భుజిస్తుంది.

అయితే ఈ గ్రామంలోని మొసలి మాత్రం ఎవరికీ హానీ చేసేది కాదట. ఒకవేళ ఎవరైనా పిల్లలు నీటిలో దిగి ఈత కొడుతున్నా సరే.. వారికి ఎలాంటి కీడు చేయకుండా ఉండేదట.. ఎవరైనా దాని దగ్గరికి వెళ్లినా... అదే వారి నుంచి తప్పుకుని మరోచోటికి వెళ్లిపోతుందట.

ఇంతమంచి మొసలి కావడం వల్ల, ఆ వూరి వాళ్లు.. దానిని సంరక్షించుకుంటూ వచ్చారు. ప్రతిరోజు దానికి అన్నం, పప్పు, కూరలు పెట్టేవారు. ఆ మొసలికి గంగారాం అని పెట్టుకునేవారు. ఈ మొసలి కారణంగా ఆ గ్రామానికి కూడా పేరొచ్చింది.

దేవుడి తర్వాత తమ గ్రామాన్ని ఆ మొసలి రక్షిస్తోందన్నది అక్కడి జనం విశ్వాసం.. ఈ క్రమంలో మంగళవారం మొసలి చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు దానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, తిరిగి గ్రామస్తులకు అప్పగించారు.

దానికి అంత్యక్రియలు చేయాలని భావించిన జనం.. దాదాపు 500 మంది చెరువు వద్దకు చేరుకుని చనిపోయిన మొసలిని తాకి, చివరి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ రోజంతా గ్రామంలోని ఒక్కరు కూడా భోజనం చేయకుండా మొసలికి నివాళులర్పించారు.