మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో నదీతీరాన మట్టిలో పురాతన బంగారు, వెండి నాణేలు దొరుకుతున్నాయనే వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో జనాలు తండోపతండాలుగా నదీతీరానికి పరుగులు పెడుతున్నారు. 

దీనిమీద స్థానిక కురావర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రామ్ నరేష్ రాథోర్ మాట్లాడుతూ.. జిల్లాలోని శివపుర గ్రామానికి సమీపంలోని పార్వతీ నదిలో పురాతన బంగారు, వెండి నాణేలు దొరుకుతున్నాయని కొంత కాలంగా వదంతులు వ్యాపించాయని అన్నారు.

దీంతో నదీ తీరానికి ప్రజలు జాతరగా తరలి వచ్చి వెతుకుతున్నారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరికీ ఒక్క నాణెం కూడా దొరకలేదు. అయినా పట్టువదలడం లేదు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు.

అయితే ఇవన్నీ వదంతులేనని వీటిని ఎవరు వ్యాప్తి చేశారో తెలియదని పోలీసులు అంటున్నారు. అంతేకాదు గత నాలుగు రోజులుగా ప్రజలు నదీ తీరాన్ని తవ్వటానికి తరలివస్తున్నారు. నదీ ఒడ్డున తవ్వొద్దని చెప్పామని పోలీస్ అధికారులు అంటున్నారు.