Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్‌లో మూత్ర విసర్జన: ఆ రోజు విమానంలో ఏం జరిగింది? ఘటన జరిగిన వెంటనే సీనియర్లకు క్రూ సిబ్బంది కీలక లేఖ..

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మూత్రం పోసిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే విమాన సిబ్బంది వారి సీనియర్లకు ఘటనకు సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఓ మెయిల్ పంపారు. ఆ మెయిల్ కీలక విషయాలను వెల్లడిస్తున్నది. విమానంలో జరిగిన ఘటనలను మరింత స్పష్టంగా వివరిస్తున్నది.
 

pee gate.. air india crew write letter to senior hours after the incident, what happended in flight
Author
First Published Jan 14, 2023, 5:35 PM IST

న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు కూడా పంపింది. అయితే, ఆ ఘటన జరిగిన తర్వాత ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయిన కొన్ని గంటల్లోనే క్రూ సిబ్బంది సీనియర్లకు ఓ మెయిల్ పంపారు. 

ఆ మెయిల్‌లో కీలక వివరాలు తెలియవచ్చాయి. ‘ఫ్లైట్ న్యూయార్క్ నుంచి బయల్దేరిన కొంత సమయానికి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న మహిళ తాను నిద్రిస్తున్నప్పుడు ఓ పురుషుడు వచ్చి అక్కడ మూత్రం పోసినట్టు ఆరోపించింది. మేం వెంటనే యాక్షన్ తీసుకున్నాం. ఆ మహిళ వస్త్రాలు మార్చుకోవడానికి సహకరించాం. ఇతర ఏ సహాయమైనా చేస్తాం అని చెప్పాం. సిబ్బంది మొత్తం ఆ ఏరియాను క్లీన్ చేశారు. ఆమె షూస్, ఇతర వస్తువులను పరిశుభ్రపరిచాం. ఆమె పక్కనే ఉన్న సీటును కూడా క్లీన్ చేశాం’ అని వివరించారు.

ఆమె పోలీసు కేసు పెట్టాలని పేర్కొందని అన్నారు. ‘ఆ మహిళ పోలీసు కేసు పెట్టాలని అనుకుంది. ఇలాంటి ఘటనలను ఎయిర్ ఇండియా సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టంగా ఆమెకు చెప్పాం. అందుకు తగిన చర్యలు తీసుకోవడంలోనూ తక్షణమే స్పందిస్తుందని వివరించాం. ఒక వేళ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని అనుకుంటే, ఎయిర్ ఇండియా కమర్షియల్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ ఆమె దిగగానే ఎయిర్‌పోర్టులో కలిసి పోలీసు ఫిర్యాదు చేయడంలో సహకరిస్తారని చెప్పాం’ అని తెలిపారు.

నిందితుడినీ తాము నిలదీశామని వారు వివరించారు. ఆ మహిళా ప్రయాణికురాలు ఆయనపై చేసిన ఆరోపణలు తెలియజేశామని పేర్కొన్నారు. ‘అతను వణికిపోయాడు. అలాంటిదేమీ తాను చేయలేదని వివరించాడు. అతను డీసెంట్‌గా కనిపించాడు. మర్యాదాగా మలుచుకుని గౌరవంగా మాట్లాడాడు. తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తానని చెప్పాడు. తనకు ఏదీ గుర్తు లేకున్నా మాట్లాడుతూనే పోయాడు. ఆ మహిళకు బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధం అని వివరించాడు. అంతేకాదు, ఆ మహిళకు పరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధమే అని తెలిపాడు’ అని వివరించారు.

Also Read: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడికి షాకిచ్చిన కోర్టు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఇంతలో ఆ మహిళ మాత్రం ఎయిర్ ఇండియా తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టిందని వివరించారు.    ‘ఆ వ్యక్తి బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి, పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మహిళకు చెప్పడంతో అతడిని కలువడానికి ఆమె అంగీకరించింది. అతడు ఆమెకు క్షమాపణలు చెప్పాడు. పరిహారం కొంత మొత్తం చెల్లించడానికి అంగీకరించాడు. అలాగే, ఆమె దుస్తులు, షూస్‌ కూడా క్లీన్ చేయిస్తా అని చెప్పాడు’ అని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

ఫస్ట్ క్లాస్‌కు పంపిస్తామని ఆఫర్ ఇస్తే నిరాకరించిన మరో ప్రయాణికుడు ఆ మహిళను రెచ్చగొట్టాడని పేర్కొన్నారు. మీడియా లేదా ప్రెస్ ముందుకు వెళ్లి ఎయిర్ ఇండియా నుంచి పరిహారం డిమాండ్ చేయమని ఉసిగొల్పాడని ఆరోపించారు. ‘దీంతో ఉన్నట్టుండి అప్పటి వరకు సిబ్బందిని ప్రశంసించిన ఆ మహిళ.. తన షూస్, బ్యాగ్ క్లీన్ చేయలేదని వారిపైనే ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది’ అని ఓ క్రూ మెంబర్ ఆరోపించారు.

‘ఆ ఘటన సమయంలో క్రూ సిబ్బంది సమర్థంగా పని చేశారు. వారి బాధ్యతలకు మించి పని చేశారు’ అని పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకెళ్లి రచ్చ చేసే అవకాశం కూడా ఉన్నదని ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ మెయిల్ నవంబర్ 27న పంపినట్టుగా ఉన్నదని కథనం ప్రచురించిన ఇండియా టుడే పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios