న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీన తాను బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పి రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు తెర లేపారు. ఆయన ఆ భారీ ప్రకటన బీహార్ కు పరిమితమవుతుందని చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు అది దేశ రాజకీయాలకు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ కాబోతోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో విజయం సాధించిన తర్వాత తాను ప్రకటన చేస్తానని ఆయన గతంలో చెప్పారు. కానీ దాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 16వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఒక్క రోజు ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు, అరవింద్ కేజ్రీవాల్ కూడా విరామం ఇస్తారు. ఆ విరామం వెనక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. 18వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రకటన వెలువడుతుంది.

ప్రశాంత్ కిశోర్ అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఆ బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయం సాధిస్తారని నిర్ధారణ కాగానే జాతీయ మీడియాలో ఓ ఆసక్తికరమైన వాణిజ్య ప్రకటన ప్రత్యక్షమైంది. బహుశా, చాలా మంది దాన్ని పట్టించుకుని ఉండరు. కానీ దాని వెనక ఓ పెద్ద కథనే ఉన్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర నిర్మాణం కోసం ఆప్ తో చేతులు కలపండంటూ ఓ నెంబర్ డిస్ ప్లే చేస్తూ మిస్డ్ కాల్ ఇవ్వండంటూ ఆ ప్రకటన చేశారు. 

పక్కా వ్యూహంతో అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేసే ప్రణాళికను రూపొందించబోతున్నారు. కేజ్రీవాల్ కు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ అది అంతగా ఫలవంతం కావడం లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్ జత కూడడంతో దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైన పదవిని చేపట్టే అవకాశం ఉంది. 

పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో ఆప్ ఇది వరకు పోటీ చేసింది. కానీ పెద్దగా ప్రభావం వేయలేకపోయింది. అయితే, ఈసారి పక్కా ప్రణాళికతో ప్రశాంత్ కిశోర్, కేజ్రీవాల్ జోడీ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికి ముందుకు వస్తున్నారని సమాచారం. 

కాంగ్రెసును పక్కకు నెట్టి బిజెపికి జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా వచ్చే నాలుగేళ్ల కాలంలో ఆప్ ను నిలబెట్టే వ్యూహరచన చేసి అమలు చేస్తారని తెలుస్తోంది. బిజెపిని ఎదుర్కోవడంలో కాంగ్రెసు విఫలమైన నేపథ్యంలో తామే ప్రత్యామ్నాయం కావాలని ప్రశాంత్ కిశోర్, కేజ్రీవాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లే వ్యూహం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలో ఉంటుందని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా బలమైన శక్తిగా ముందుకు ఎలా వస్తుందనేది భవిష్యత్తు మాత్రమే తేలుస్తుంది.