దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 ఢిల్లీ నిర్భయ ఘటన నిందితులకు ఉరి శిక్షను అమలు చేసే తలారి గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అతనికి సంబంధించిన వివరాల కోసం నెటిజన్లు విపరీతంగా బ్రౌజ్ చేస్తున్నారు.

మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ జల్లాద్ నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు. ఆయన కుటుంబ నేపథ్యంలోకి వెళితే.. పవన్ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వ్యక్తులు తలారీలుగా పనిచేస్తున్నారు.

Also Read:నిర్భయ దోషులకు ఉరి... నొప్పి తెలియకుండా ఉండేందుకు.

పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటీష్ వారి హయాంలో జైల్లో తలారిగా పనిచేస్తూ విప్లవ వీరుడు సర్దార్ భగత్‌ సింగ్‌ను ఉరి తీశారు. పవన్ తాత కల్లూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకులతో పాటు కరడుకట్టిన ఖైదీలు బిల్లా, రంగాలను ఉరి తీశారు.

పవన్ తండ్రి మమ్మూ 2011 మే 19లో మరణించే వరకు 47 ఏళ్ల పాటు మీరట్ జైల్లో తలారీగా పనిచేశారు. ఆయన మరణంతో 2013లో పవన్ జల్లాద్‌ను యూపీ జైళ్ల శాఖ మీరట్ కోర్టు తలారీగా నియమించింది.

నితారీ కేసులో దోషి అయిన సురేందర్ కోలికి కోర్టు తొలుత మరణశిక్ష విధించడంతో పవన్‌కు ఉరి శిక్షను అమలు చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ శిక్షను యావజ్జీవ ఖైదుగా మారచడంతో ఆయనకు ఛాన్స్ మిస్సయ్యింది.

తనకు తలారీ ఉద్యోగమంటే ఎంతో ఇష్టమని, తీవ్ర నేరాలకు పాల్పడిన నేరస్థులకు ఉరిశిక్షను వేయడం సరైనదేనని పవన్ వ్యాఖ్యానించారు. తన కుమారుడిని ఎట్టి పరిస్ధితుల్లో తలారీగా కొనసాగించబోనని పవన్.. ఈ వృత్తి తనతోనే అంతరించిపోవాలని పవన్ స్పష్టం చేశారు

Also Read:నా కూతురు పేగులు బయటకు లాగారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ మానవ హక్కులు.. నిర్భయ తల్లి

తలారీగా తనకు గతంలో నెలకు మూడు వేల రూపాయల స్టైఫండ్ ఇచ్చేవారని... దానిని ప్రస్తుతం ఐదు వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. నిర్భయ కేసులో దోషులైన నలుగురు ఖైదీలను ఉరి తీసేందుకు తాను సిద్ధమని పవన్ జల్లాద్ ప్రకటించారు. యూపీ ప్రభుత్వం అనుమతిస్తే ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లి తన విధి నిర్వర్తిస్తానని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.