దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల ర్యాలీలకు సానుకూలంగా లేవని ఆరోగ్య శాఖ ఇటీవలే ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ప్రత్యక్ష ప్రచారానికి బదులు డిజిటల్ క్యాంపెయినింగ్‌పై ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తున్నది. యూపీలోని అన్ని పార్టీలు సోషల్ మీడియాలో లైవ్‌లు, వర్చువల్ ర్యాలీలకు ప్లాన్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Coronavirus) దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. ఒమిక్రాన్(Omicron) కేసులూ భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజే సుమారు లక్షన్నర కేసులు రిపోర్ట్ అవుతుండటంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తీవ్రమైంది. ఎన్నికల నిర్వహణ నుంచి వెనుకడుగు వేసేది లేదని పరోక్షంగా ఎన్నికల సంఘం సంకేతాలను ఇచ్చింది. అయితే, దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ, నిపుణులతో చర్చలు జరుపుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు ఎన్నికల ర్యాలీలు నిర్వహించడానికి సానుకూలంగా లేవని కొవిడ్ టాస్క్ చీఫ్ డాక్టర్ వీకే పాల్.. ఎన్నికల సంఘానికి తెలిపిన సంగతి తెలిసిందే. దీనితో ఎన్నికల ర్యాలీలు గతంలో మాదిరిగా ఉండవనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ క్యాంపెయినింగ్ కోసం పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. సోషల్ మీడియా(Social Media)తోపాటు.. ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో వ్యాన్‌లు, ట్రక్‌లనూ నడిపే ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానంలో ప్రచారం నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఐదు రాష్ట్రాల్లో యూపీ ఎన్నికలపైనే దేశమంతటా ఆసక్తి నెలకొని ఉన్నది.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో తాము ప్రత్యక్ష ఎన్నికల ర్యాలీలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. 15 రోజుల పాటు యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ర్యాలీలు నిర్వహించబోమని, వర్చువల్‌లోనే ర్యాలీలు చేపడతామని వెల్లడించింది. ఇలాంటి ప్రకటన చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. ఇప్పటి వరకు ఇతర పార్టీలూ ఇలాంటి ప్రకటన చేయలేవు. కానీ, యూపీలోని అన్ని పార్టీలు డిజిటల్ క్యాంపెయినింగ్(Digital Campaign)కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియాలో లైవ్‌లో ప్రచారం చేయడానికి ప్రియాంక గాంధీ సిద్ధం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా షెడ్యూల్ ప్రకటించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలూ లైవ్‌లో ఆమెను నేరుగా ప్రశ్నలు వేయవచ్చని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ లైవ్ లింక్‌ను పార్టీ వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటి వరకు డిజిటల్ క్యాంపెయినింగ్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్‌లు నడిచాయి. ఇతర పార్టీలతో పోటీ పడి డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడానికి సమాజ్‌వాదీ పార్టీ రెడీగా ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ పార్టీ కార్యకర్తలతో వాట్సాప్ గ్రూపులు భారీగా ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో చేరడానికి లింకులనూ షేర్ చేస్తున్నారు. అలాంటి కొన్ని గ్రూపుల్లో సమాజ్ వాదీ పార్టీ ప్రచార చిత్రాలు, వీడియోలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఇతర పార్టీల కన్నా చాలా ముందంజలో ఉండే బీజేపీ ఎన్నికల ముంగిట్లో న్యూస్ పేపర్లలో ప్రధానంగా ప్రచారం చేస్తున్నది. గత నెల రోజులుగా న్యూస్ పేపర్‌లలో హాఫ్ పేజీ లేదా ఫుల్ పేజీ యాడ్‌లతో కుమ్మేస్తున్నది. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ చిత్రాలతో డబుల్ ఇంజిన్ కీ సర్కార్, సోచ్ ఇమాందార్, కామ్ దందార్ , ఫర్క్ సాఫ్ హై వంటి నినాదాలతో ప్రచారం చేస్తున్నది. ఇలాంటి మెస్సేజీలతోనే ఇతర సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ప్రచారం చేస్తున్నది. ప్రత్యక్షంగానే బీజేపీ ఇటీవలి కాలం వరకు భారీ కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే వర్చువల్ ర్యాలీలూ చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు బీజేపీ ఐటీ వింగ్ నిర్వాహకులు చెప్పారు. యూపీలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఈ పార్టీకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి.
