ఈ నెల 31 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6న ముగింపు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ఈ సమావేశాలు ముగుస్తాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. ఈ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీన మొదలై మధ్యలో తాత్కాలిక విరామం తర్వాత ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 66 రోజుల కాలంలో 27 సిట్టింగ్‌లు ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడించారు.
కాగా, గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం చేస్తారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు ట్వీట్ చేశారు.
Also Read: కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి.. ఎందుకు చాలా ముఖ్యమైనది..? ఇలా తెలుసుకొండి..
కేంద్ర బడ్జెట్ రెండు విడతల్లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో రాష్ట్రపతి ప్రసంగం, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, దానిపై ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం, బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. ఈ విరామ సమయంలో ఆయా మంత్రిత్వ శాఖలు సమర్పించిన గ్రాంట్లపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రాంట్ల కోసం వచ్చిన డిమాండ్లు, ఇతర నివేదికలను పరీక్షిస్తుంది.
అనంతరం, మార్చి 12వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఇందులో ఆయా గ్రాంట్లకు ఆమోదం, డిమాండ్లపై చర్చ జరుగుతంది. ఈ విడతలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.