రియల్-మనీ ఆన్‌లైన్ గేమ్స్‌ని నిషేధించే బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది 3.8 బిలియన్ డాలర్ల గేమింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతుందట.
Online Gaming Bill 2025 : భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ని ఆమోదించింది. ఇది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ గేమింగ్ పరిశ్రమలో కీలక మలుపుగా చెప్పవచ్చు. బుధవారం లోక్‌సభ, గురువారం రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లు అన్ని రియల్-మనీ ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధిస్తుంది. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారుతుంది.
3.8 బిలియన్ డాలర్ల గేమింగ్ పరిశ్రమకు గట్టి దెబ్బ
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం భారతదేశం 3.8 బిలియన్ డాలర్ల గేమింగ్ రంగాన్ని కుదిపేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఫాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ కార్డ్ గేమ్స్ బాగా ప్రజాదరణ పొందడంతో దేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధిచెందింది. డ్రీమ్11, గేమ్స్24x7, మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) వంటి కంపెనీలు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాయి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్ కు ఇవి ఇంధనంగా పనిచేశాయి.
కానీ ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకానున్నాయి. గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు తగ్గడమే కాదు ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. అలాగే ఆదాయాలు తగ్గడంతో చిన్న సంస్థలు మూతపడే అవకాశం ఉంది. పెద్దపెద్ద లిస్టెడ్ కంపెనీలకు ఈ హీట్ తగులుతుంది.
ఆన్ లైన్ గేమింగ్ బిల్లు ఎందుకు తెచ్చారు?
కొన్ని ఆన్ లైన్ గేమ్స్ వల్ల ప్రజలు మోసపోతున్నారని… మరికొన్నింటివల్ల దేశ భద్రతకే ముప్పు వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఆన్ లైన్ లో జూదం ఆడించే గేమ్స్ పై ప్రజాాగ్రహం పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
“జూలై 30, 2025న నేను పార్లమెంటులో జంగిల్ రమ్మీ, డ్రీమ్11 వంటి ప్లాట్‌ఫారమ్స్ ఎంత ప్రమాదకరమో వివరించాను. బావి గ్రామంలో జరిగిన విషాద సంఘటనను హైలైట్ చేశాను. అక్కడ ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం కారణంగా ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది” అని ఎంపీ ఓంప్రకాష్ రాజె నింబాల్కర్ ప్రభుత్వం ఆన్ లైన్స్ గేమ్స్ నిషేధించడాన్ని మద్దతిస్తూ LinkedInలో ఓ పోస్ట్ చేశారు.
“ఆన్లైన్ గేమ్స్ వ్యసనంగా మారాయని… వీటినుండి మన యువత, కుటుంబాలను రక్షించడానికి ప్రత్యక్ష బాధ్యత తీసుకొని దేశవ్యాప్తంగా చట్టం తీసుకురావాలని నేను ప్రభుత్వాన్ని కోరాను. నేడు రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, సామాజిక శ్రేయస్సు కోసం ఇది చాలా ముఖ్యమైన చర్య” అని ఎంపీ ఓంప్రకాష్ పేర్కొన్నారు.
ఆన్లైన్ గేమ్స్ నిషేధంతో ఏం జరుగుతుంది?
ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లును చాలామంది స్వాగతించగా కొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలతో ఉపాధి అవకాశాలు దెబ్బతినడమే కాదు ప్రభుత్వం కూడా భారీ ఆదాయాన్ని కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
“రియల్ మనీ గేమింగ్ ను బ్యాన్ చేయడంద్వాారా 2,00,000 ఉద్యోగాలు పోతాయి. అంతేకాదు రూ. 20,000 కోట్ల జిఎస్టి నష్టం జరుగుతుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 వల్ల జరిగే అసలు నష్టం ఇదే” అని VinFinCapital వ్యవస్థాపకుడు వినాయక్ సేథ్ LinkedIn పోస్ట్‌లో రాశారు.
టెక్నాలజీ, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలలో గేమింగ్ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని… ప్రభుత్వం తాజా నిషేధంతో చిన్న గేమింగ్ కంపెనీలు మూతపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. “చాలా గేమింగ్ కంపెనీలు తమ ఉద్యోగులలో 10–20% మందిని మాత్రమే నిలుపుకోగలవు” అని సేథ్ హెచ్చరించారు.
ఆదాయం పరంగా గేమింగ్ పరిశ్రమ జిఎస్టి (GST) కింద ఏటా రూ.20,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తోందని తెలిపారు. ఈ నిషేధంతో ఈ ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోతుందన్నారు. “ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం వేరే చోట పన్నులు పెంచుతుందా?” అని సేథ్ ప్రశ్నించారు. పూర్తిగా నిషేధించడం కంటే ఆలోచనాత్మకమైన నియంత్రణ ఉద్యోగాలు, ఆదాయం రెండింటినీ కాపాడుతుందని వినాయక్ సేథ్ సూచించారు.
