జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నరమేధంలో పాకిస్తాన్, ఆ దేశంలో దాగిన ఉగ్రమూకల కుట్రలకు సంబంధించి మనదేశం ఆధారాలు చూపించినా దాయాది దేశం నమ్మలేదు.

ఈ క్రమంలో సుమారు 20 నెలల తర్వాత ఇమ్రాన్ ప్రభుత్వ నాయకత్వంలోనే పుల్వామా దాడి జరిగిందని పాకిస్తాన్ అంగీకరించింది. పుల్వామాలో పాకిస్తాన్ సాధించిన విజయం మనదేశం సాధించిన విజయమంటూ ఇమ్రాన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న ఫవాద్ చౌదరి గురువారం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు.

తాము హిందుస్తాన్‌లోకి ప్రవేశించి మరి చంపామని ఫవాద్ చెప్పుకొచ్చారు. పుల్వామా దాడి తమ ప్రభుత్వానికి పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారత్‌ భగ్గుమంది. ఈ నేపథ్యంలో పుల్వామా దాడి తర్వాత గతంలో మోడీ ప్రభుత్వంపై విపక్షాలు సంధించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అవేంటో ఒకసారి చూస్తే:

అరవింద్ కేజ్రీవాల్: 

 

పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా మోడీకి మద్ధతు ఇస్తున్నారు. ఆ దేశంతో ప్రధాని రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఇప్పుడు స్పష్టమైంది. మోడీకి సాయం చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్తాన్ మన 40 మంది సైనికుల్ని చంపిందా..? అని వాదనలు వినిపిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

 

 

రాహుల్ గాంధీ:

ఈ రోజు మనం పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ అమరవీరుల స్మృతిలో మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతున్నాను,

1. ఈ దాడి వల్ల ఎవరు ప్రయోజనం పొందారు..?
2. దాడిపై దర్యాప్తులో ఏం తేలింది..?
3. ఉగ్రదాడికి దారితీసిన భద్రతాపరమైన లోపాలకు బీజేపీ ప్రభుత్వంలో బాధ్యత ఎవరిదీ.??

 

 

 

ఫరూక్ అబ్ధుల్లా: 

‘ పుల్వామా దాడి వెనుక ప్రధాని నరేంద్రమోడీ వున్నార నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించారు. 2019 ఏప్రిల్‌లో శ్రీనగర్‌లో ప్రసంగించిన ఆయన ఈ విధంగా ఆరోపించారు. అంతేకాకుండా మహాత్మాగాంధీని చంపిన హంతకులు ఢిల్లీలో ఉన్నారంటూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగారు.

అలాగే భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించిన సంగతిని అబ్ధుల్లా గుర్తుచేశారు. అంతేకాకుండా బాలాకోట్‌‌లో భారత వైమానిక దళం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌పైనా ఫరూక్ అబ్ధుల్లా ఆరోపణలు చేశారు. బాలాకోట్‌లో జరిగిన నష్టంపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీ వేసేలా భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని కోరాలని ఆయన డిమాండ్ చేశారు.

బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో కేవలం చెట్లు మాత్రమే నాశనమయ్యాయని అబ్ధుల్లా సెటైర్లు వేశారు. కార్గిల్ యుద్ధంపై అమెరికా వెలువరించిన నివేదికలను విశ్వసించిన భారత్.. బాలాకోట్‌లో ఎటువంటి నష్టం జరగలేదని అమెరికా చెప్పినప్పుడు ఎందుకు నమ్మడం లేదని అప్పట్లో ఫరూక్ అబ్ధుల్లా ప్రశ్నించారు. 

మమతా బెనర్జీ:

 

లోక్‌సభ ఎన్నికల వేడిలో మోడీ ప్రభుత్వం యుద్ధానికి వెళ్లాలనుకుంటుందా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుల్వామా దాడి నేపథ్యంలో వ్యాఖ్యానించారు. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు మత విద్వేషాలను రేకెత్తించాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అమిత్ షా- మోడీలు రాజీనామాలు చేయాల్సింది పోయి.. రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉగ్ర దాడిపై ప్రభుత్వానికి ముందస్తు సంకేతాలు అందినా ఆ ప్రాంతంలో వాహనాలను స్వేచ్ఛగా తిరిగేలా ఎలా అనుమతించారని నిలదీశారు. ఈ సంఘటన తర్వాత తాను మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేశానని, అయితే దేశభక్తి అంటే ఏమిటో తమకు నేర్పడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అందువల్లనే మాట్లాడాల్సి వచ్చిందని బెనర్జీ అన్నారు.

పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత ఏమి చేయలేకపోయిన మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు యుద్ధం లాంటి హిస్టీరియాను సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్లలో పాకిస్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. రాజకీయ డివిడెంట్ కోసం ఇంతటి విషాదాన్ని దోపిడీ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని మమత వ్యాఖ్యానించారు.

ఇది ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ ఆడిన ఆటగా అభివర్ణించిన మమత... పరిస్ధితిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను తాము ఎట్టి పరిస్ధితుల్లో సమర్ధించబోమని చెప్పారు. ఇదే సమయంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పించాలని దేశం మొత్తం కోరుకుంటున్న వేళ.. పొరుగుదేశంపై కఠినచర్యలను టీఎంసీ వ్యతిరేకిస్తోందని ఆయన చురకలంటించారు.

పశ్చిమ బెంగాల్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని.. వాటిని అడ్డుకోవడానికి తృణమూల్ ప్రభుత్వం ఏం చేయలేదని దిలీప్ ఆరోపించారు. మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన వారు వున్నా.. మమత ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు పుల్వామా దాడిపై ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించి.. దాడి వెనుక వున్న వారికి కఠిన శిక్ష విధించాలని మమత డిమాండ్ చేశారు. మతతత్వ శక్తులు రెచ్చగొడితే ప్రజలు బలవ్వకూడదని.. అలాగే అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆమె ఆదేశించారు. 

రామ్‌గోపాల్ యాదవ్, ఎస్పీ నేత:

ఓట్ల కోసం ప్రభుత్వం పుల్వామా మారణ హోమానికి పాల్పడింది