పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ మిలటరీకి చెందిన డ్రోన్ ఒకటి భారత భూభాగంలో చక్కర్లు కొట్టింది. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రాజస్తాన్‌లోని హిందుమల్‌కోట్‌లోకి పాక్ డ్రోన్ ప్రవేశించింది.

దీనిని గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ తుకముడిచింది. మరోవైపు నియంత్రణ రేఖ సమీపంలో శనివారం పెనుప్రమాదం తప్పింది. జవాన్లను లక్ష్యంగా అమర్చిన ఐఈడీని సైన్యం నిర్వీర్యం చేసింది.

ఉదయం పదింటికి అఖ్నూర్ సెక్టార్‌లోని నంద్వాల్ చౌక్ వద్ద రోడ్డు పక్కన తనిఖీలు నిర్వహిస్తున్న సైన్యం ఐఈడీని గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి దానిని నిర్వీర్యం చేశారు.

ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు అలాంటివి ఇంకేమైనా అమర్చారా అన్న అనుమానంతో బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబును అమర్చిన వారి కోసం గాలిస్తున్నారు.