గోవా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పీ మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఇక్కడ హంగ్ ఏర్పడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ కూటమి నెక్ టు నెక్ పోరాడినట్టు స్పష్టం అవుతున్నది. ఈ రెండింటికి దాదాపు సమానంగా సీట్లు వస్తాయి. మెజార్టీ మార్క్ దాటే అవకాశం లేదు. తద్వారా సుమారు ఆరు సీట్లు గెలుచుకునే ఆప్ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, తృణమూల్ కాంగ్రెస్ వంటి కొత్త పార్టీలు రావడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పీ మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నెక్ టు నెక్ పోటీ ఉన్నట్టు అర్థం అవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ కూటమి దాదాపు ఒకే స్థాయిలో సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. పీ మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ 13 నుంచి 17 సీట్లు గెలుచుకుంటుంది. కాగా, కాంగ్రెస్ కూటమి కూడా 13 నుంచి 17 సీట్లు గెలుచుకుంటుంది. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీలు మెజార్టీ మార్క్ క్రాస్ చేసే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆప్ కింగ్ మేకర్‌గా అవతరలించనుందని ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఆప్ 2 నుంచి 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాగా, టీఎంసీ, ఎంజీపీ పార్టీలు 2 నుంచి 4 సీట్లు గెలుపొందుతారు. కాగా, ఇతరులు నాలుగు సీట్ల వరకు గెలుచుకుంటారు. తద్వారా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ఈ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.
ఓటు షేరింగ్ కూడా దాదాపు బీజేపీ, కాంగ్రెస్ అలయెన్స్ మధ్య సమానంగా ఉన్నది. బీజేపీ 29 శాతం, కాంగ్రెస్ కూటమి 28.2 శాతం ఓటు షేర్ పొందినట్టు ఈ ఎగ్జిట్ పోల్ తెలిపింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల పోలింగ్‌తో ముగియగా.. ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు గత నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ముగిశాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ వివరాలు ఇలా ఉన్నాయి.
పర్యాటక రాష్ట్రంగా పేర్గాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది. అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన సాంక్వెలిమ్ నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే, ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.
గోవాలో అధికారంలో బీజేపీ ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సాంక్వెలిమ్ నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం ఫేస్‌ను ఇంకా ప్రకటించలేదు. ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది.
రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు పోటీ ఇస్తున్నాయి.
గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల బెడద ఎక్కువ. ఇక్కడ పార్టీల కంటే రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. నియోజకవర్గాలు చిన్నగా ఉండటంతో నేతలకే ప్రజలతో నేరుగా ఉండే సంబంధాలు ఎక్కువ.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం. ఆప్ కూడా గోవాలో ప్రచారం ముమ్మరం చేపట్టింది.
