NCRB: దేశంలో నిరుద్యోగం, అప్పుల బాధ‌తో 25 వేల మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. మొత్తం ఆత్మ‌హ‌త్య‌ల్లో దాదాపు 9,140 మంది నిరుద్యోగం కారణంగా బ‌ల‌వంతంగా త‌మ ప్రాణాలు తీసుకోగా, 16,091 మంది అప్పుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ రాజ్య‌స‌భలో వెల్లడించారు.

NCRB: పార్ల‌మెంట్ లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ నేప‌థ్యంలో నిరుద్యోగ సమస్య (unemployment) పై చర్చ జరుగుతుండగా, 2018-2020 మధ్యకాలంలో 25,000 మందికి పైగా భారతీయులు నిరుద్యోగం, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలియజేసింది. దాదాపు 9,140 మంది ప్రజలు నిరుద్యోగం (unemployment) కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే, ఇదే స‌మ‌యంలో 16,091 మంది అప్పుల (indebtedness) కారణంగా త‌మ ప్రాణాలను బ‌ల‌వంతంగా తీసుకున్నార‌ని తెలిపింది. రాజ్య‌స‌భ‌లో ఈ అంశంపై ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర‌ మంత్రి (హోం) నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయ‌ని చెప్పారు. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau-NCRB) ప్ర‌కారం.. 2020 మహమ్మారి సంవత్సరంలో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరిగాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన 2020 ఏడాది అత్య‌ధికంగా (3,548) ఆత్మహ‌త్య‌లు చోటుచేసుకున్నాయి. ఇక 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 2019లో 2,851 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అప్పుల (రుణ‌భారం) కార‌ణంగా ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య సంఖ్య గ‌మ‌నిస్తే.. 2018లో 4,970 మంది, 2019లో 5,908 మంది ఆత్మ‌హ‌త్య చేసుకోగా, 2020లో 600 మరణాలు తగ్గి 5,213కి చేరుకున్నాయి. ఇదిలావుండ‌గా, దేశంలో నిరుద్యోగం (unemployment) పెరుగుతున్న‌ద‌నీ, ప్ర‌భుత్వం దీని క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు.

"మానసిక రుగ్మతల భారాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోంది. దేశంలోని 692 జిల్లాల్లో NMHP కింద జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (DMHP) అమలుకు మద్దతు ఇస్తోంది" అని మంత్రి రాయ్ (Nityanand Rai) చెప్పారు. అలాగే, “ఆత్మహత్య నిరోధక సేవలు, కార్యాలయంలో ఒత్తిడి నిర్వహణ, జీవిత నైపుణ్యాల శిక్షణ, పాఠశాలలు- కళాశాలల్లో కౌన్సెలింగ్ అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం; జిల్లా హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌లోని వివిధ స్థాయిలలో నివారణ, ప్రమోషన్, దీర్ఘకాలిక నిరంతర సంరక్షణతో సహా మానసిక ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య సంరక్షణ సేవల పంపిణీలో సమాజ అవగాహన, భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది” అని తెలిపారు.

దేశంలో నిరుద్యోగం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పదేళ్లలో 27 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకి లాగితే, నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు 23 కోట్ల మంది ప్రజలను తిరిగి పేదరికంలోకి నెట్టిందని విమ‌ర్శించారు.