విపక్షల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఓ లేఖను ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఇందులో బీజేపీ నేతలను ప్రత్యేకించి అప్పీల్ చేశారు. తాను కూడా ఒకప్పుడు బీజేపీ వాడినేనని అన్నారు. ఆ పార్టీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపారు. అదే విధంగా ప్రత్యర్థి ద్రౌపది ముర్ముపై విమర్శలు సంధించారు. 

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బీజేపీ నేతలకు సరికొత్త విధానంలో అప్పీల్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని బీజేపీ నేతలను కోరారు. తద్వార బీజేపీని రక్షించుకోవచ్చని వివరించారు. బీజేపీని రక్షించడానికి వారి చేతిలో ఉన్న చివరి అవకాశం ఇదేనని పేర్కొన్నారు. తనను గెలిపించడం ద్వారా దేశాన్నీ రక్షించినవారు అవుతారని తెలిపారు. అదే విధంగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై విమర్శలు సంధించారు. ఆమె రబ్బర్ స్టాంప్ వంటి వారని, మౌనమే ఆమె విధానమని విమర్శించారు. ఆమె దేశ రాజ్యాంగాన్ని రక్షిస్తుందా? లేక ప్రధాని మంత్రిని రక్షిస్తుందా? అని ఓ లేఖ విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యులు పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేయాలని అప్పీల్ చేశారు. దేశాన్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి, లౌకికత్వాన్ని రక్షించడానికి తనకు ఓటు వేయాలని కోరారు. ప్రత్యేకంగా బీజేపీ నేతలకు ఆయన ఓ అప్పీల్ చేశారు. తాను ఒకప్పుడు బీజేపీకి చెందినవాడినే అని గుర్తు చేసుకున్నారు. అటల్ బిహారి వాజ్‌పేయి, లాల్ క్రిష్ణ అడ్వానీ సారథ్యంలో ఉన్న పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, అలాంటి వాతావరణం ఇప్పుడు బీజేపీలో లేదని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పడానికి బాధపడుతున్నారని వివరించారు. ప్రస్తుత ఏక నాయకుడి సారథ్యంలో ఉన్న బీజేపీ దిగజారిపోయిందని పేర్కొన్నారు. అప్పటి పార్టీకి, ఇప్పటి పార్టీకి మధ్య గల తేడాను మీరంతా స్పష్టంగా గ్రహించే ఉంటారని అన్నారు. కాబట్టి, బీజేపీలో మంచి మార్పు తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని, ఇదే చివరి అవకాశం అని వివరించారు. తనను గెలిపించి బీజేపీని రక్షించడమే కాదు.. దేశంలో ప్రజాస్వామ్యాన్నీ రక్షించిన వారు అవుతారని తెలిపారు.

Scroll to load tweet…

అదే విధంగా తన ప్రత్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన విమర్శలు చేశారు. తన భావజాలం భారత రాజ్యాంగం అయితే.. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న శక్తుల భావజాలాన్ని తన ప్రత్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నదని విమర్శించారు. తాను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నిలబడ్డారని, కానీ, దేశ ప్రజాస్వామ్యంపై నిత్యం దాడులు జరుపుతున్న వారికి మద్దతుగా తన ప్రత్యర్థి నిలబడ్డారని పేర్కొన్నారు.

ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పౌరుడి హక్కులను, స్వేచ్ఛను గౌరవించడానికి తాను పాటుపడతానని, కానీ, వీటిని కాలరాసి స్వైర విహారం చేసే వారు తన ప్రత్యర్థిని ఎంచుకున్నారని తెలిపారు. సెక్యులరిజం, రాజ్యాంగ పీఠికను రక్షించడానికి నిలబడ్డానని వివరించారు.

మన దేశం ఎలాంటి రాష్ట్రపతిని కోరుకుంటున్నదని ప్రశ్నించారు. ఆమె తన క్యాంపెయిన్ మొత్తంలో మౌనంగానే ఉన్నారని, ఎన్నికైతే రాష్ట్రపతిగానూ ఆమె అలాగే ఉంటుందని సూచనలు వచ్చేశాయని వివరించారు. ఆమె కేవలం రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతిగా ఉంటుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించే రాష్ట్రపతి కావాలా? లేక ప్రధానిని కాపాడే రాష్ట్రపతి కావాలా? అని అడిగారు. కాబట్టి, పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేసి దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని కాపాడాలని వివరించారు.