పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, జేడీఎస్ సహా మొత్తం 21 ప్రధాన పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా బంద్‌కు మద్ధతిచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది.

సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ సమయాన్ని నిర్ణయించినట్లు కాంగ్రెస్ తెలిపింది. మరోవైపు వామపక్షాలు మాత్రం విడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌‌ కారణంగా ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

వైసీపీ తప్పించి మిగిలిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బంద్‌కు మద్ధతు ప్రకటించాయి. ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్టాండ్ల వద్దా వామపక్షాలు, జనసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బంద్ దృష్ట్యా ఇవాళ రాయలసీమ యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. తెలంగాణలో మాత్రం బంద్ ప్రభావం నామమాత్రంగా కూడా కనిపించలేదు.