అదానీ ఇష్యూపై స్పందించాలని ప్రతిపక్షాల డిమాండ్.. స్కామ్‌ల జాబితాను ఏకరువుపెట్టిన ప్రధాని మోడీ
అదానీ గ్రూప్‌పై వచ్చిన విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్‌లను ఏకరువు పెట్టారు.

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూపు కంపెనీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఆర్థిక ఆందోళనల నుంచి ఇది రాజకీయంగానూ కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రధాని మోడీ, అదానీ ఇద్దరూ గుజరాతీలు కావడం, రాహుల్ గాంధీ ముందు నుంచీ అదానీ లబ్ది కోసం మోడీ పాటుపడుతున్నాడని ఆరోపణలు చేయడం వంటివి తాజా రిపోర్టుపై చర్చను తీవ్రతరం చేశాయి. ‘అదానీ స్కామ్(?)’ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని, పార్లమెంటులో స్పందించాలని పట్టుబట్టాయి. తాజాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ స్కామ్‌ల గురించి ప్రస్తావించారు.
‘అదానీ స్కామ్(?)’ పై మాట్లాడాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్‌లను ఏకరువుపెట్టారు. 2జీ స్కాం, బొగ్గు గనుల స్కాం, ఓటుకు నోటు, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌లను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని డిఫెన్స్ స్కామ్‌లనూ పేర్కొన్నారు. 2004 నుంచి 2014లో కాంగ్రెస్ హయాంలోని కాలాన్ని ‘కోల్పోయిన దశాబ్ది’(The Lost Decade)గా తెలిపారు.
Also Read: ఒక పెద్ద నాయకుడు రాష్ట్రపతిని అవమానించారు.. వారిలో ద్వేషం బయటపడింది: ప్రధాని మోదీ
2004 నుంచి 2014 మధ్య కాలంలో స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అత్యధిక అవినీతి కేసులు నమోదయ్యాయని పీఎం మోడీ అన్నారు. అంతేకాదు, ఈ కాలంలోనే ఉగ్రవాద శక్తులు తలలెత్తుకున్నాయని తెలిపారు. ఆ పదేళ్లలో భారత్ అంతర్జాతీయ యవనికపై తన పట్టును కోల్పోయిందని వివరించారు.