ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత నగ్మాకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. శివపురి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆమె అక్కడికి వచ్చారు.

అయితే.. ఆమె కోసం పార్టీ కార్యకర్తలు ఎగబడటం విశేషం. ఆమెను చూసేందుకు సొంత పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించగా.. ఇద్దరు నేతలైతే ఏకంగా స్టేజ్ పైనే తన్నుకున్నారు. దీంతో.. ఈ సంఘటన  వైరల్ గా మారింది.

పరిస్థితి మరీ చేయిదాటుతుండటంతో.. స్పందించిన నగ్మా.. పార్టీ నేతల వివాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనుకున్న సమయం కన్నా.. ఆలస్యంగా సభాస్థలికి వచ్చినందుకు క్షమాపణలు తెలిపారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యకర్తలు తనను అడ్డుకోవడం వల్లే.. ఆలస్యం అయిందని వివరణ ఇచ్చారు. కాగా నగ్మా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఆమె గ్వాలియర్, శివపురి, కరెరా తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా గతంలోనూ ప్రచారం సందర్బంగా నగ్మాకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఒక కాంగ్రెస్ నేత.. ఏకంగా నగ్మాని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. ఆమె సినీ నటి కావడంతో.. రాజకీయ నాయకులు కూడా ఆమె విషయంలో అత్యుత్సాహం చూపించడం గమనార్హం.