heatwave: దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందనే అంచనాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పాఠశాలల్లో బోధన వేళలను మార్చింది. అంతకుముందు ఏప్రిల్ 26న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Meteorological Department: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటకే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం ప్రస్తుతం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందనీ, దీని కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (India Meteorological Department-ఐఎండీ) హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వేడి గాలుల వీచే పరిస్థితులు మరింతగా పెరుగుతాయని తెలిపింది. దేశంలోని పదుల సంఖ్యలోని రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. రానున్న వారం రోజుల వ్యవధిలో ఇది మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఒడిశాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేడి గాలుల తీవ్రత కూడా క్రమంగా అధికం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బోధన వేళలను రీషెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. కొత్త సమయం ఉదయం 6:00 నుండి 9:00 వరకు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బోధన వేళలను రీషెడ్యూల్ మే 2 నుండి అమలులోకి వస్తుంది. "ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మే 2 నుండి అన్ని పాఠశాలల్లో ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు బోధనా సమయాన్ని మార్చడం సంతోషకరం. అయితే, ఇప్పటికే వివిధ బోర్డులు/కౌన్సిల్స్ ద్వారా షెడ్యూల్ చేయబడిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి" అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పిల్లలపై ఎండల ప్రభావం పడకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని పేర్కొంటున్నారు.
కాగా, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అంతకుముందు ఏప్రిల్ 26 న అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. "ఒడిశాలో ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా, ఒడిశాలోని ఉన్నత విద్యా శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఉన్నత విద్యా సంస్థల (హెచ్‌ఇఐలు)లో తరగతి గది బోధన (యూపీ, పీజీ) ఏప్రిల్ 27, 2022 నుండి మే 2, 2022 వరకు నిలిపివేయబడుతుంది"అని ఉన్నత విద్యా శాఖ తెలిపింది. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బోధన వేళలను రీషెడ్యూల్ చేసింది.
ఇదిలావుండగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందనీ, ఆ సమయంలో బయటకు వెళ్లేవారు వెంట గొడుగు తీసుకెళ్లడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారినపడిగే వెంటనే ఆస్పత్రుల్లో చేరాలని పేర్కొన్నారు. ఒడిశాతో పాటు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వేడిగాలుల తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో 45 ఢిగ్రీలకు పైగా పెరిగే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. దేశరాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వచ్చే నెల వారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. రెండో వారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశముందని తెలిపింది.
