బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

కేంద్రాపఢాలో ఆదివారం జరిగిన స్వయం సహాయ బృందాల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘లెజండరీ బీజూ బాబు కర్మ భూమి అయిన ఈ కేంద్రాపఢా నుంచి నేను ఓ విషయమై ప్రకటన చేస్తున్నాను.

ఒడిశా నుంచి పార్లమెంటుకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలు వెళ్తారు అని తెలిపారు. భారత్‌లో మహిళలు సాధికారత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారు.

ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనాల్లాగా అత్యాధునిక దేశం కావాలన్నా అందుకు మహిళా సాధికారతే మార్గమని నవీన్ అన్నారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలు కూడా తమ మాటపై నిలబడి, ఆ దిశగా అడుగులు వేయాలని పట్నాయక్ పిలుపునిచ్చారు.

కాగా, మహిళల కోసం నిర్మిస్తున్న మిషన్ శక్తి భవనం కోసం ఆయన రూ.కోటి మంజూరు చేశారు. మరోవైపు మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు మద్ధతు తెలుపుతూ గతేడాది నవంబర్‌లో ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేశారు. తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం.