మనలో చాలామందికి పడుకునేముందు ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకోవడం అలవాటు. ఆ అలవాటు మంచిది కాదని, రేడియేషన్ వల్ల మెదడుకు ప్రమాదం అని  చాలాసార్లు నిపుణులు హెచ్చరించినా వినరు. 

కేరళలోని కొల్లాం జిల్లాలో దిండుకింద పెట్టుకున్న ఫోన్ పేలి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నోకియా ఫోన్ ను పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకున్నాడు. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఆ వ్యక్తి భుజం, ఎడమ మోచేతికి తీవ్రగాయాలయ్యాయి. 

బాదితుడు కారు డ్రైవర్ గా తెలుస్తోంది. త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుడిని అతని ఇంటివద్ద వదిలిపెట్టి వచ్చి పడుకున్నానని, బాగా అలిసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని అతను చెబుతున్నాడు. గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మెలుకువ వచ్చిందని, భుజం నొప్పిగా అనిపించిందని గమనిస్తే దిండు కాలిపోతూ ఉందని, దిండుకిందున్న ఫోన్ నుండి నిప్పురవ్వలు వస్తున్నాయని అన్నాడు. 

వెంటనే ఫోన్ ను దూరంగా తోసేసి ఆస్పత్రికి వెళ్లాడట. అయితే ఫోన్ దిండు కింద పెట్టినప్పుడు ఛార్జింగ్ ఏమీ పెట్టలేదని అయినా కూడా బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయిందని బాధితుడు చెబుతున్నాడు. ఈ పేలుడుకు కారణాలు ఏంటో తెలియదని అంటున్నాడు.