Noida's Supertech Towers: ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియను రెండు వారాల్లోగా ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కూల్చివేతపై సంబంధిత అధికారులతో చర్చించి మూడు రోజుల్లో తేదీని నిర్ణయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Noida's Supertech Towers: ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈ పని ప్రారంభించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమంగా నిర్మించిన ఈ జంట భవనాలను కూల్చివేసేందుకు 72 గంటల వ్యవధిలో సంబంధిత ఏజెన్సీలతో సమావేశం కావాలని నోయిడా సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, నిర్ణీత సమయంలో కూల్చివేత ప్రారంభించాలని నోయిడా సీఈవోకు సుప్రీం తెలిపింది.
రియల్టీ సంస్థ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా అక్రమంగా 40 అంతస్తుల జంట టవర్లను నిర్మించింది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్లు నిర్మిస్తున్నారని, విస్తరణకు తమ అంగీకారం తీసుకోలేదని హౌసింగ్ ప్రాజెక్ట్ వాసులు కోర్టును ఆశ్రయించారు. భవనాల్లోని 900 ప్లాట్లు, 21 దుకాణ సముదాయాలను నోయిడా అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పిటిషన్ ల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అలహాబాద్ హైకోర్టు 2014 ఏప్రిల్ 11న జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ సూపర్‌టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సూపర్‌టెక్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, సూపర్‌టెక్ దాఖాలు చేసిన పిటిషన్‌ను గతేడాది తిరస్కరించింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది.
నోయిడా అధికారులతో కుమ్మక్కై నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించినందుకు సూపర్‌టెక్ లిమిటెడ్‌కు చెందిన 40 అంతస్తుల జంట టవర్లను మూడు నెలల్లో కూల్చివేయాలని గతేడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా కూల్చివేత ప్రారంభించాలని, చట్ట నియమానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది.
అయితే.. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు నిర్మాణ సంస్థపై జనవరి 12న ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. కోర్టు సమయాన్ని వృథా చేస్తే.. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ టవర్స్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేసే వారికి..బుకింగ్ సమయం తీసుకున్న మొత్తానికి 12 శాతం వడ్డీని కలిపి ఫిబ్రవరి 28లోగా చెల్లించాలని, జంట టవర్ల నిర్మాణం కారణంగా జరిగిన వేధింపులకు గాను, ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్ యొక్క RWAకి ₹2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. భవనాల కూల్చివేత ఖర్చును మొత్తం సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని నోయిడా అథారిటీకి సుప్రీం ధర్మాసనం సూచించింది. బాధితులు కోర్టుకు వచ్చేలా చేయవద్దు అని సుప్రీం తెలిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
