పాఠశాలల్లో పిల్లలకు భగవద్గీతే కాదు.. ఖురాన్, బైబిల్‌కు సంబంధించి బోధించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. గుజరాత్ పాఠశాలల్లో భగవద్గీత అంశంపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్‌లోని (gujarat) పాఠశాలల్లో భగవద్గీత (bhagavad gita) ప్రవేశపెడుతున్న అంశంపై కర్ణాటక (karnataka) మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సిద్ధరామయ్య (siddaramaiah) స్పందించారు. తాను ఏ మత గ్రంథాలకు కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కానని స్పష్టం చేశారు. మన దేశానిది భిన్నమైన సంస్కృతి అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మనం సమైక్య జీవన విధానంలో ఉన్నామని .. తాము హిందూ ధర్మంపై నమ్మకం కల్గినవారమని తెలిపారు. పాఠశాల పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధరామయ్య చెప్పారు.
తాము రాజ్యాంగపరంగా లౌకికవాద విధానాలను నమ్ముతామని స్పష్టం చేశారు. బడుల్లో భగవద్గీతతో పాటు ఖురాన్ (THE QURAN) , బైబిల్‌ను (holy bible) విద్యార్థులకు నేర్పినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిద్ధూ తేల్చిచెప్పారు. విద్యార్థులకు అవసరమైనది గుణాత్మకమైన విద్య అని ఆయన వ్యాఖ్యానించారు. భగవద్గీతను మన ఇళ్లలో పిల్లలకు చెబుతారని .. రామాయణ, మహాభారతం వంటివాటిని కూడా పిల్లలకు నేర్పుతారని సిద్ధరామయ్య గుర్తు చేశారు. నైతిక విద్య అవసరమని, కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు.. కర్ణాటక రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ (hijab) ధరించడంపై తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు (karnataka high court) వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) తెలిపారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ సహా మరో ఇద్దరు న్యాయమూర్తులకు ఈ భద్రత కల్పిస్తామని వివరించారు. హిజాబ్‌పై తీర్పు వెలువరించిన ఈ ముగ్గురు (కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ, న్యాయమూర్తి క్రిష్ణ దీక్షిత్, న్యాయమూర్తి ఖాజీ ఎం జైబున్నీసా) న్యాయమూర్తులను ఓ వ్యక్తి బెదిరిస్తున్న వీడియో కలకలం రేపింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే సీఎం బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆ వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలపై వెంటనే అప్రమత్తం కావాలని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇలాంటి జాతి వ్యతిరేక శక్తులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. మన దేశంలో న్యాయవ్యవస్థ సమర్థంగా ఉన్నది కాబట్టే శాంతి భద్రతలు స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు న్యాయమూర్తులు బెదిరిస్తున్న వీడియో కేసుకు సంబంధించి తమిళనాడులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలపై మౌనం దాల్చిన కుహనా లౌకికవాదులనూ తాను ప్రశ్నిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఇది లౌకికత్వం కాదని, మతోన్మాదం అని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అందరూ కలిసి ఏకమై.. ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
